Skip to content
ప్రపంచం వార్తలు

US-Iran War: పతాక స్థాయికి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. హార్ముజ్ జలసంధి వేదికగా దాడులు.. కువైట్‌పై ఇరాన్ ప్రతీకారం..

Prajapaksham 13 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US-Iran War: పతాక స్థాయికి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. హార్ముజ్ జలసంధి వేదికగా దాడులు.. కువైట్‌పై ఇరాన్ ప్రతీకారం..

US-Iran War: పతాక స్థాయికి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. హార్ముజ్ జలసంధి వేదికగా దాడులు.. కువైట్‌పై ఇరాన్ ప్రతీకారం..

US-Iran War: పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు వరుస దాడులకు తెగబడటంతో.. అమెరికా సైన్యం భారీ ఎత్తున ప్రతీకార దాడులను ప్రారంభించింది. గడిచిన 24 గంటల్లోనే అమెరికా వరుసగా మూడోసారి ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడటం అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితికి అద్దం పడుతోంది.

హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై ఇరాన్ జరుపుతున్న దాడుల సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకే ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్ దళాలను జవాబుదారీగా చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో ఈ దాడులు జరుగుతున్నాయి. గడిచిన మూడు రాత్రులలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలు కలిసి దాదాపు 300కి పైగా.. ఇరాన్ సైనిక లక్ష్యాలు, క్షిపణి లాంచర్లు, డ్రోన్ కేంద్రాలు,వాయు రక్షణ (Air Defence) వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తాజా దాడులన్నీ దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌ సహా తీర ప్రాంతాలపైనే జరిగాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. భారీ పేలుళ్లతో హోర్మోజ్గాన్ కంపించిపోయినట్లు ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది.

అమెరికా భీకర దాడులు జరుపుతున్న సమయంలోనే.. ఇరాన్ దళాలు హార్ముజ్ జలసంధిలో ఒక పౌర వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. అయితే, అక్కడే మోహరించి ఉన్న అమెరికా రక్షణ దళాలు తక్షణమే స్పందించి.. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణిని, ఒక డ్రోన్‌ను గాల్లోనే విజయవంతంగా కూల్చివేసినట్లు సెంట్‌కామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పష్టం చేశారు.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం పొరుగునే ఉన్న, అమెరికా దళాలకు ఆశ్రయమిస్తున్న గల్ఫ్ దేశాలపై ఎదురుదాడులకు దిగింది. ముఖ్యంగా కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల తమ సరిహద్దులోని మూడు పోస్టులు దెబ్బతిన్నాయని కువైట్ ప్రకటించింది. అలాగే కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన ఒక ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కువైట్‌లో ఉన్న అమెరికాకు చెందిన అధునాతన హిమార్స్ రాకెట్ లాంచర్లను తాము ధ్వంసం చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించగా.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. తమ సైనికులెవరూ గాయపడలేదని సెంట్‌కామ్ స్పష్టం చేసింది.

గల్ఫ్ ప్రాంతంలో వేగంగా మారుతున్న ఈ పరిణామాలు, ముదురుతున్న యుద్ధ మేఘాలపై ఐక్యరాజ్యసమితి (UN) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు తక్షణమే సంయమనం పాటించి దాడులను నిలిపివేయాలని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిమాండ్ చేశారు. హార్ముజ్ జలసంధి మూతపడి.. ఈ ఘర్షణ గనుక పూర్తిస్థాయి అంతర్జాతీయ యుద్ధంగా మారితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ భద్రతకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.