Skip to content
ప్రపంచం వార్తలు

Vietnam Boat Tragedy: వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల వాసులు పలువురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Prajapaksham 11 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Vietnam Boat Tragedy: వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల వాసులు పలువురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Vietnam Boat Tragedy: వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. పలువురు తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Vietnam Boat Tragedy: వియత్నాంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్న స్పీడ్‌బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తాజా న్యూస్ వెలుగులోకి వచ్చింది. అందుతున్న వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ప్రముఖ మొబైల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్.. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయశ్రీ అనే మహిళ అక్కడికక్కడే మరణించారు. కడపకే చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ప్రమాద సమయంలో బోటు ఎక్కకుండా ఒడ్డునే ఉండిపోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

భారత్‌కు చెందిన ఒక ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ తమ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం వియత్నాం టూర్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 250 మంది ఈ విహార యాత్రకు వెళ్లగా.. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా వీరంతా మూడు వేర్వేరు పడవల్లో సముద్రంలో విహారానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హాన్‌ మే రుట్‌ ద్వీపం నుంచి అన్‌థోయ్‌ పోర్టుకు తిరిగి వస్తున్న సమయంలో 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బంది ఉన్న ఒక స్పీడ్‌బోట్ తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా బోల్తా పడింది. సముద్ర ప్రయాణంలో ఉండగా వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు.. అలల ఉద్ధృతే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉన్నట్లు వియత్నాం స్థానిక పత్రిక VnExpress కూడా నివేదించింది.

ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు, స్థానిక రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నీటిలో మునిగిపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు (బార్లా) పడిపోవడం.. సముద్రంలో అలల వేగం తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని స్థానిక అధికారులు తెలిపారు. సిబ్బంది కొందరిని సురక్షితంగా బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించగా.. మరికొందరు సముద్రంలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు, రెస్క్యూ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ఘోర విపత్తుపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన వివరాలను సేకరిస్తూ స్థానిక అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపింది. బాధిత భారతీయ కుటుంబాలకు తక్షణ సహాయం, అత్యవసర సమాచారాన్ని అందించేందుకు వీలుగా హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో పాటు హనోయిలోని ఎంబసీలోనూ ప్రత్యేక కంట్రూల్ రూంలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వియత్నాంలోనే అతిపెద్ద ద్వీపం, అందమైన బీచ్‌ల కారణంగా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫూ క్వాక్ తీరంలో జరిగిన ఈ ప్రమాదం ఇరు దేశాల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. సరదా కోసం వెళ్లిన విహార యాత్రలో తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల్లో ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది.