భారాసకు భారం అవుతున్న కవిత… తెర వెనుక రాజకీయాలు ఏంటి..?
భారాసకు భారం అవుతున్న కవిత... తెర వెనుక రాజకీయాలు ఏంటి..?
భారతీయ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి కొత్త కుంపటి పెట్టుకున్న కవిత ఇప్పుడు భారాసకు భారం అవుతుందా అంటే అవును అనే విషయం అర్థం అవుతోంది. ఎందుకంటే ఇంటిగుట్టు రట్టు చేయడంలో ప్రతిపక్షం కన్నా కల్వకుంట్ల కవిత చాలా యాక్టివ్ గా ఉండటంతో ఇది భారాసకు ఒక తలకు మించిన భారంగా మారుతుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల కన్నా కూడా ముందుగానే కవిత తమ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను లీకుల రూపంలో విడుదల చేస్తూ బీఆర్ఎస్ కు డ్యామేజీ చేయడంలో ముందు వరుసలో నిలబడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్ నాయకత్వం తలలు పట్టుకుంటుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా కల్వకుంట్ల కవిత ఒక మీటింగులో మాట్లాడుతూ కేటీఆర్ ఇటీవల 180 కోట్లు పెట్టి ఒక ఇంగ్లీషు పేపర్ యాజమాన్యాన్ని సొంతం చేసుకున్నారని, ఇకపై ఆ ఇంగ్లీష్ పేపర్ భారతీయ రాష్ట్ర సమితి అధికారిక పేపర్ తన పార్టీకి ఆ న్యూస్ పేపర్ తో ఇక తమకు పనిలేదని బహిరంగ సభలో కుండబద్దలు కొట్టి చెప్పారు. నిజానికి రాజకీయాల్లో తెర వెనక జరిగే ఈ వ్యవహారాలను ఇలా బహిరంగ సభలో బయట పెట్టడం అనేది ఒక రకంగా వెన్నుపోటు వ్యవహారం అని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అంతేకాదు కేటీఆర్ కు సంబంధించిన అనేక వ్యవహారాలను గతంలో కవిత ఇలానే బయటపెట్టారు. నిజానికి ఇవన్నీ కూడా తీవ్రమైన ఆరోపణలు, వీటిపైనా బీఆర్ఎస్ మౌనంగా ఉండడం చూడవచ్చు. కానీ నెమ్మదిగా ఈ మౌనం కాస్త ఎప్పటికైనా కాళ్ళ కిందకు నీళ్లు తెస్తుందని భారతీయ రాష్ట్ర సమితి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కవితను విమర్శించేందుకు అటు పార్టీ నుంచి కౌంటర్ పెద్దగా ఉండడం లేదు. ముఖ్యంగా ఆమె అధినేత కేసిఆర్ కుమార్తె కావడంతో పాటు, ఎప్పటికైనా భారతీయ రాష్ట్ర సమితికి ఆమె తిరిగి వస్తుందని నమ్మకం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. దీంతో విమర్శల విషయంలో బీఆర్ఎస్ తట పటాయిస్తోందని, అంతర్గతంగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భారతీయ రాష్ట్ర సమితి ఇంతకాలం కవితను భరిస్తోందని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం శృతి మించక ముందే అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాలని, కవిత విషయంలో కఠినంగా ఉండాలని డ్యామేజీ జరగకముందే చర్యలు తీసుకోవాలని కింది స్థాయి నేతలు అధినాయకత్వం ముందు ఏకరువు పెడుతున్నారు.
ఇక కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని భారతీయ రాష్ట్ర సమితి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శలు చేశారు. హరీష్ రావు సైతం ఇదే కోణంలో విమర్శలు చేస్తున్నారు. కానీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత విషయంలో ఆయన వైఖరి ఎంతో స్పష్టంగా తెలియడం లేదు. ఇది కూడా పార్టీ వర్గాలకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ను నిర్మిస్తోందని, మొత్తానికి ఈ వ్యవహారం ముందు ఎటువైపు వెళుతుందో ఎదురు చూడాల్సిందే.