Trump Warns Iran: నన్ను చంపాలని చూస్తే వేయి క్షిపణులతో దాడులు.. ఏడాది పాటు విధ్వంసం.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..
Trump Warns Iran: నన్ను చంపాలని చూస్తే వేయి క్షిపణులతో దాడులు.. ఏడాది పాటు విధ్వంసం.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..
Trump Warns Iran: పశ్చిమాసియా (Middle East) లో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం రద్దు కావడంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఉద్రిక్తతలు మరింత పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే.. అమెరికా నుండి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. అంతేకాకుండా కేవలం తొలి దాడితో ఆగకుండా అవసరమైతే ఏడాది పాటు ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ (Truth Social) లో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడిని.. ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. ఇప్పటికే వేయి క్షిపణులు దాడికి సిద్ధంగా (Locked and Loaded) ఉన్నాయి. తొలి దాడి జరిగిన వెంటనే వేలాది క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి అమెరికా సైన్యానికి ఇప్పటికే అవసరమైన అన్ని ఆదేశాలు ఇచ్చామన్నారు. అవసరమైతే ఒక సంవత్సరం పాటు లేదా ఆ పైన కూడా ఇరాన్‌లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా వ్యూహాలు రచించామన్నారు. టెహ్రాన్ ని నామరూపాల్లేకుండా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ ఇరాన్ తనను చంపగలిగితే.. ప్రపంచం ఇంతవరకు ఎన్నడూ చూడని స్థాయిలో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. ఇరాన్ కొత్తగా పన్నిన హత్య కుట్రలపై ఇజ్రాయెల్ వద్ద సమాచారం ఉందనే వార్తల నేపథ్యంలో.. చాలా ఏళ్లుగా తానే ఇరాన్ కిల్ లిస్ట్‌లో నంబర్ వన్ టార్గెట్‌గా ఉన్నానని ఆయన పునరుద్ఘాటించారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఈ స్థాయి శత్రుత్వానికి ప్రధాన కారణం 2020 నాటి ఘటన అని చెప్పుకోవచ్చు. ట్రంప్ తన మొదటి విడత అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తూ వస్తోంది. అమెరికా నిఘా సంస్థలు కూడా ఇరాన్ అనుబంధ శక్తులు ట్రంప్‌పై కుట్రలు పన్నుతున్నట్లు గతంలోనే వెల్లడించాయి. ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణానంతరం జరిగిన ప్రదర్శనల్లో ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ నినాదాలు రావడం గమనార్హం.
ఇరాన్ మళ్లీ అమెరికాతో చర్చలు జరపాలని కోరినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అయితే తాము ఇప్పటికే ఇరాన్‌కు ఇచ్చిన కాల్పుల విరమణ (Ceasefire) గడువు ముగిసిందని (Truce is Over) స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు, అమెరికా క్షిపణి దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా తీవ్ర ఉత్కంఠగా మారింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ పట్ల అమెరికా తీసుకునే సైనిక నిర్ణయాల్లో ఎలాంటి వెనకడుగు ఉండబోదని ట్రంప్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
మధ్యవర్తిత్వ దేశాలు ఒకవైపు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే.. వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి అంటూ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పశ్చిమాసియాను మరో అంతర్జాతీయ యుద్ధ ముంగిట నిలబెట్టేలా ఉన్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.