అమెరికా దొంగ నాటకాలు…రష్యా క్రూడాయిల్ కోసం, రిలయన్స్ పెట్రోల్ తో చీకటి ఒప్పందం…
అమెరికా దొంగ నాటకాలు...రష్యా క్రూడాయిల్ కోసం, రిలయన్స్ పెట్రోల్ తో చీకటి ఒప్పందం...
యావత్ ప్రపంచానికి రష్యాతో దోస్తీ చేస్తే బాగుండదని ఆంక్షలు విధించి పబ్బం గడుపుకుంటున్న అమెరికా తాను మాత్రం యథేచ్ఛగా రష్యా నుంచి దిగుమతి అయ్యే చౌక క్రూడ్ ఆయిల్ నుంచి తయారైన పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తూ దొంగ నాటకాలకు తెరలేపింది. నిజానికి ఈ దొంగ నాటకం గడచిన కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. దీని వెనుక రిలయన్స్ పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చి మళ్లీ రిలయన్స్ అమెరికాకు విక్రయిస్తుంది. ఈ చీకటి ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు కూడా విరుద్ధం అనే చెప్పవచ్చు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం మళ్లీ ప్రారంభం అవడంతో పాటు, హార్ముజ్ జలసంధి మూసివేతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లో ఒడిదుడుకులు మరోసారి తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
మరోవైపు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ, చమురు దిగుమతుల విషయంలో భారత్ తన ‘ప్లాన్-బి’ వ్యూహంతో ముందుకు వెళుతోంది. భారత్ తాజాగా రష్యా చమురును కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి గణాంకాల ప్రకారం, జూన్‌లో భారతదేశ రష్యా చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, ఇది ఏకంగా 34% పెరుగుదల నమోదు అయింది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) వెలువరించిన ఒక PTI నివేదిక ప్రకారం, రష్యా మొత్తం చమురు ఎగుమతి ఆదాయం తగ్గినప్పటికీ, గత జూన్‌లో భారతదేశ రష్యా ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది మే నెలతో పోలిస్తే 34% పెరుగుదలగా చెప్పవచ్చు.
జూన్‌లో భారతదేశం 4.5 బిలియన్ యూరోల విలువైన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసింది. దీంతో భారత్, చైనా తర్వాత రష్యన్ ఇంధనానికి రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. జూన్‌లో 7.3 బిలియన్ యూరోల కొనుగోళ్లతో చైనా రష్యాకు అతిపెద్ద కస్టమర్‌గా నిలిచింది.
రష్యా నుంచి చమురు సరఫరా పెరగడం వల్ల ప్రధాన రిఫైనరీల్లో దిగుమతులు నెలవారీగా 5.4% పెరిగాయి. మేతో పోలిస్తే జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీకి సరఫరాలు 150% పెరిగాయి. అదే సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పారాదీప్ రిఫైనరీలో దిగుమతులు 126% పెరిగాయి. BPCL యొక్క కొచ్చి రిఫైనరీలో ప్రాసెసింగ్ 82%, నయారా ఎనర్జీ వడినార్ రిఫైనరీలో 45% పెరిగిందని CREA పేర్కొంది.
నిజానికి రష్యా నుంచి ఎగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు అనేక దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ చమురు కొనుగోలు చేస్తోంది.
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే క్రూడ్ ఆయిల్ వెనుక ఒక పెద్ద బిజినెస్ ఉంది. అదేమిటంటే రష్యా భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేస్తే, భారత్‌లోని రిఫైనరీలు ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీ వంటివి ఆ క్రూడ్ ఆయిల్‌తో పెట్రోల్, డీజిల్ అలాగే విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను తయారు చేసి, మళ్లీ ఆ ఉత్పత్తులను అమెరికా, యూరప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తాయి.
అంటే అమెరికా నేరుగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయదు. బదులుగా భారతదేశంలోని రిలయన్స్ రిఫైనరీలో తయారయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంటాయి.
జామ్‌నగర్ రిఫైనరీలో ప్రాసెస్ చేసిన మొత్తం క్రూడ్ ఆయిల్‌లో 27% పైగా రష్యా నుంచి దిగుమతి అయిందే కావడం గమనార్హం.