Editorial: ఉన్నత విద్య కేంద్రీకరణకు తీవ్ర అభ్యంతరాలు
Editorial: ఉన్నత విద్య కేంద్రీకరణకు తీవ్ర అభ్యంతరాలు
ఉన్నత విద్యను పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోవటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు పలు అత్యున్నత స్థాయి విద్యాసంస్థలనుంచి, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత స్వాగతించదగింది. ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ఆదేశించిన ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. దాని లక్ష్యం యూనిటరీ వ్యవస్థ అనగా అధ్యక్ష తరహా పాలన. అప్పుడు రాష్ట్రాలు నామమాత్రావశిష్టమవుతాయి. అన్ని అధికారాలు అధ్యక్షుని చేతిలోనే ఉంటాయి. రాజ్యాంగాన్ని మార్చే శక్తిని ప్రజలు ఇవ్వని కారణాన, రాజ్యాంగంలోని వెసులుబాట్లను ఉపయోగించుకుని అధికారాలను కేంద్రీకరిస్తూ చట్టాలు చేస్తున్నది.
జీఎస్‌టీ వ్యవస్థను ప్రవేశపెట్టి అదేదో రెండవ స్వాతంత్య్ర సాధన అన్నంత బిల్డప్ ఇచ్చి స్వాతంత్య్రం సిద్ధించిన అర్ధరాత్రిని సంకేతంగా తీసుకుని ఆ చట్టాన్ని పార్లమెంటు భవన్ నుంచి అర్థరాత్రి అమలులోకి తెచ్చింది. ఆ చట్టం రాష్ట్రాల ఆర్థిక సార్వభౌమత్వాన్ని గుంజుకుంది. జాతీయ విద్యావిధానమంటూ ఒక తిరోగమన విధానాన్ని దేశంపై రుద్దింది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ)ని నెలకొల్పి ‘ఒకే దేశం పరీక్ష’ అంటూ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షలను దానికి అప్పగించింది. పరీక్ష పేపర్ల లీకుతో ఆ నిర్వహణ ఎంత భ్రష్టుపట్టిందో చూస్తున్నాం. అంతకుముందు రాష్ట్రాలు తమ స్వంత ఎంసెట్ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, బి.ఫార్మసీ తదితర సీట్లు భర్తీ చేసుకునేవి. ప్రాంతీయ భాషలో కూడా పరీక్ష ఉండేది గనుక మాతృభాషలో చదువుకున్న గ్రామీణ విద్యార్థులకు సైతం ప్రవేశపరీక్షలో న్యాయం జరిగేది.
అటువంటి కేంద్రీకరణ పరంపరలో కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త బిల్లు “వికసిత్ భారత్ శిక్షా అధిస్థాన్ (విబిఎస్‌ఏ) బిల్లు, 2025”. ఈ బిల్లు ప్రస్తుతం బీజేపీ ఎంపీ డి. పురంధేశ్వరి చైర్మన్‌గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, అఖిల భారత సాంకేతిక విద్య కౌన్సిల్, ఉపాధ్యాయ విద్య జాతీయ కౌన్సిల్ చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో ఒకేఒక అత్యున్నత సంస్థ (విబిఎస్‌ఏ) ఏర్పాటుకు ఈ బిల్లు ఉద్దేశించింది. రెగ్యులేటరీ, అక్రిడిటేషన్, స్టాండర్డ్ కౌన్సిళ్లు ఈ బిల్లు కిందకు వస్తాయి.
ఈ నూతన నియంత్రణ వ్యవస్థ నుంచి తమను మినహాయిస్తున్నట్లు స్పష్టంగా బిల్లులో చేర్చాలని ఐఐటీలు, ఐఐఎంలు వంటి జాతీయ ప్రాముఖ్యతగల సంస్థలు (ఐఎన్‌ఐలు), వాటితోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌లు) కోరాయి. ఐఎన్‌ఐలు, ప్రఖ్యాతిగాంచిన సంస్థల స్వయం ప్రతిపత్తి రక్షణను క్లాజు 49 వాగ్దానం చేస్తున్నదనే ప్రభుత్వ వాదనతో ఆ సంస్థలు సంతృప్తిపడలేదు.
ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, మధ్యప్రదేశ్ వంటి ఎన్‌డీఏ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బిల్లులోని కేంద్రీకరణ నిబంధనలను గట్టిగా వ్యతిరేకించినట్లు జేపీసీకి ఆ ప్రభుత్వాలు సమర్పించిన మెమొరాండంలు తెలియజేస్తున్నాయి. కాన్పూర్, హైదరాబాద్, సంబల్‌పూర్ ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్ బిల్లు పరిధినుంచి పూర్తి మినహాయింపు కోరాయి. పరిశోధన, పాఠ్యప్రణాళిక, అకడమిక్ కార్యకలాపాలకు సంబంధించి సంపూర్ణమైన వ్యవస్థాగత స్వయంప్రతిపత్తి అవసరాన్ని అనేక ఇతర ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లు వక్కాణించాయి. ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లను నెలకొల్పిన చట్టాలకన్నా ప్రతిపాదిత బిల్లులోని నిబంధనలు ప్రాధాన్యం పొందుతున్నాయని ధన్‌బాద్ ఐఐటీ, కోల్‌కతా ఐఐఎస్‌ఈఆర్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఎత్తి చూపాయట. లా, మెడిసిన్‌లను బిల్లు పరిధిలో చేర్చకపోవటాన్ని ఐఐటీ ప్రశ్నించిందట! బిల్లులోని పెనాల్టీ స్వరూపాన్ని అనేక సంస్థలు విమర్శించాయట.
ఈ అధికార కేంద్రీకరణ బిల్లును రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ బిల్లును “చాలా చెడ్డ విద్యా చట్టం”గా అభివర్ణించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ ఈ విబిఎస్‌ఏ బిల్లును గట్టిగా వ్యతిరేకించాల్సిందిగా ఎన్‌డీఏ ప్రభుత్వాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలకు హాని చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది.
ఉన్నత విద్య విషయంలో సమన్వయం, ప్రమాణాల నిర్ణయం వరకే ఎంట్రీ 66 కింద పార్లమెంటరీ అధికారం పరిమితం చేయబడిందని గుర్తు చేసిన రమేశ్ ఈ బిల్లు ఆ అధికారాన్ని అతిక్రమిస్తున్నదన్నారు. ఈ బిల్లు ఫలితంగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, అఖిల భారత సాంకేతిక విద్య కౌన్సిల్ ప్రస్తుతం కలిగిఉన్న గ్రాంట్‌ల పంపిణీ అధికారం కేంద్ర విద్యామంత్రిత్వశాఖ కిందకు వెళుతుందని, దీనితో ఉన్నత విద్యా సంస్థలపై కేంద్ర కంట్రోలు పెరుగుతుందన్నారు.
ఉన్నతవిద్య నియంత్రణలో కీలక మార్పులు తలపెట్టిన ఈ బిల్లుపై విద్యావేత్తలతో, సంస్థలతో మరింత విస్తృత చర్చ జరగాలి. ఉన్నత విద్యాసంస్థల మాటకు విలువ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాన్ని గుంజుకునే ప్రయత్నాలకు రాజకీయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకించి ఈ తిరోగమన బిల్లును కేంద్రం ఉపసంహరించుకునేటట్లు చేయాలి.