పనిచేయని ట్రంప్ బెదిరింపులు
Trump Warns Iran: ఒప్పందానికి రండి.. లేదంటే కథ ముగించేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు..
యుద్ధ బెదిరింపులు, తమదికాని ధనాన్ని స్తంభింపజేయటం, ఆర్థిక ఆంక్షలు విధించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఈ ఎత్తుగడలు ఫలించటం లేదు. అందువల్ల ఆయన చర్యలు, ప్రకటనల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమ వసతులను ధ్వంసం చేసే నిమిత్తం ట్రంప్ యూదు జాత్యహంకారి, యుద్ధోన్మాది ప్రధాని నెతన్యాహుతో కలిసి ఈ ఫిబ్రవరిలో జరిపించిన బాంబుదాడులు ఇరాన్‌కు కొంతనష్టం చేసినా ట్రంప్‌కు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇదే లక్ష్యంతో 2025జూన్‌లో కూడా పై జంట రాజ్యాలు బాంబుదాడులు చేశాయి. మరోసారి పెద్ద ఎత్తున విమానదాడులు సాగించినా ఇరాన్ అణుకార్యక్రమాన్ని నాశనం చేయగలరన్న నమ్మకం లేదు. మరి తన ప్రతిష్ట కాపాడుకునేందుకు ట్రంప్‌కు ఏది దారి? ఆ దారి దొరక్కనే ఇరాన్‌ను భయపెట్టి లొంగదీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అర్థరాత్రి ఆకస్మికంగా ఆ దేశ సర్వోన్నత మతనాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ నివాసంపై బాంబుదాడులు జరిపించి ఆయన్ను, కొందరు కుటుంబసభ్యులు, కొందరు ముఖ్య సైనిక, రాజకీయ నాయకులను హత్యచేశాక, ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలుపెట్టాడు. ఇరాన్ సంప్రదింపులకు లొంగిరాకపోతే, హోర్ముజ్ జలసంధిగుండా ఆయిలు, వాణిజ్య నౌకల స్వేచ్ఛారవాణాను అనుమతించకపోతే దానిని ధ్వంసం చేస్తానని, భూగోళం నుంచి నామరూపాల్లేకుండా చేస్తానని అధ్యక్షుడు ట్రంప్ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీచేయలేదు, ప్రపంచ దేశాలను భయకంపితం చేయలేదు! అయినా ఇరాన్ మొండిధైర్యం వీడలేదు. హోర్ముజ్ దిగ్బంధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంపించింది. అణుబాంబుకన్నా (తమవద్ద బాంబులేదని, ఆ ఆలోచన తమకు లేదని ఇరాన్ నాయకత్వం ఎన్నోసార్లు చెప్పింది) ఆయిలు శక్తిమంతమైనదిగా నిరూపించింది. ఆర్థిక సంక్షోభ ఛాయలు ట్రంప్ అహంభావాన్ని దించాయి. ఏకపక్షం గా కాల్పుల విరమణ ప్రకటించి, తనకు సంబంధించి యుద్ధం ముగిసిందన్నారు. మధ్యవర్తుల ద్వారా ఉద్రిక్తతల నడుమ చర్చల ప్రక్రియ మొదలైంది. కిందుమీదుల తదుపరి జూన్ 17న అమెరికా మధ్య 60రోజుల్లో అంతిమ ఒప్పందం లక్ష్యంగా అవగాహన పత్రంపై నాటకీయంగా సంతకాలు జరిగాయి. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కొనసాగింపు, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ అంశాలు ఉద్రిక్తతను రాజేస్తూనే ఉన్నాయి.
అవగాహన పత్రాన్ని ఎవరు ఉల్లంఘించారు? అందులోని మొట్టమొదటి అంశం లెబనాన్ కాల్పుల విరమణ కిందకు వస్తుందని చెప్పింది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా తీవ్రవాదులను అంతం చేసే పేరుతో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది. ఆక్రమించిన ప్రాంతాన్ని ‘బఫర్ జోన్’గా పరిగణిస్తాంగాని సైన్యాలను ఉపసంహరించుకోబోమని నెతన్యాహు ప్రకటించాడు. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు జరగనందున అవగాహన పత్రంపై సంతకాలు జరిగిన మొదటిరోజునుంచే ఉల్లంఘన మొదలైందన్నది ఇరాన్ వాదన. జూన్ 26న లెబనాన్‌నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణను హిజ్బుల్లా ఆయుధాలు విడనాడటంతో ముడిపెట్టి అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. హిజ్బుల్లా దాడులపేరుతో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అవగాహన పత్రాన్ని దెబ్బతీయటానికి త్రైపాక్షిక ఒప్పందం రెండు మిత్రరాజ్యాల సమష్టి ప్రయత్నమన్న ఇరాన్ ఆరోపణ సరైనదిగా రుజువైంది.
రెండవ ప్రధాన వివాదాంశం హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణను తొలగించాలన్న అమెరికా ఆలోచన, పట్టుదల. అవగాహన పత్రంలోని ఐదవ అంశం ప్రకారం, పర్షియన్ గల్ఫ్ నుంచి ఒమన్ సముద్రంలోకి వాణిజ్య నౌకల రాకపోకలను ఎటువంటి రుసుము వసూలు చేయకుండా 60 రోజులపాటు స్వేచ్ఛా ప్రయాణానికి ఏర్పాట్లు చేయటానికి ఇరాన్ అంగీకరించింది. హోర్ముజ్ జలసంధి భవిష్యత్ అడ్మినిస్ట్రేషన్, నౌకాయానం గూర్చి నిర్ణయించటానికి ఇరాన్ ఒమన్‌తో, యితర పర్షియన్ గల్ఫ్ తీరప్రాంత దేశాలతో చర్చలు జరుపుతుంది అని కూడా అది చెప్పింది. దాని ననుసరించి ఇరాన్ తన తీరంవెంట నౌకల రాకపోకలకు కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయగా, ఇరాన్ పట్టును దెబ్బతీయటానికై ఒమన్ తీరంవెంట మరో మార్గం తెరిచారు. టాంకర్లు తమ మార్గంలోనే ప్రయాణించాలని ఇరాన్ పట్టుబట్టగా, అమెరికా మరికొన్ని గల్ఫ్ దేశాలు ఒమన్ రూట్‌ను ప్రోత్సహించాయి. ఆ మార్గంలో వెళుతున్న మూడు ఓడలపై క్షిపణి దాడులు జరిగాయి. ఇరాన్‌ను అమెరికా నిందించింది. గత నెలలో కూడా ఓడల ప్రయాణంపై అమెరికా, ఇరాన్ మధ్య రెండుసార్లు దాడులు జరిగాయి. ఈ మధ్యలో ట్రంప్ విధ్వంసం, చర్చల నిలుపుదల బెదిరింపులకు, ఇరాన్ వెనకడుగు వేయలేదు. ఈలోపు అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదలను కూడా ట్రంప్ మధ్యలో నిలుపు చేశాడు.
ఏదో ఒక విజయం హోర్ముజ్ ద్వారా స్వేచ్ఛారవాణా, లేదా ఇరాన్ అణుకార్యక్రమం రద్దు సాధించి తన యుద్ధాన్ని సమర్థించుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలేవీ ముందుకు సాగటం లేదు. ట్రంప్‌కు కోపం వచ్చింది. ‘కాల్పుల విరమణ రద్దు చేస్తున్నా. ఇరాన్‌కు వినాశం తప్పదు. వారు పెద్ద తప్పు చేశారు. నా మటుకు చర్చలు ఇష్టం లేదు. మా ప్రతినిధులు చర్చలు కోరుతున్నారు. వారిష్టం’. అని బుధవారం బాంబుపేల్చినంత పని చేశాడు. ఇరాన్ ఆయిలు వాణిజ్యంపై ఆంక్షలు విధించాడు. టెహరాన్‌పై అమెరికా విమానాలు బాంబులు వేశాయి. ప్రతిగా ఇరాన్ అమెరికా మిత్రరాజ్యాలు బహరైన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధాగారాలపై బాంబులు వేసింది.
టెహరాన్‌పై ఆర్థిక, సైనిక ఒత్తిళ్లు పనిచేయకపోవటంతో ఆయన చిందులు వేస్తున్నాడు. ట్రంప్ సంకటావస్థలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలిడితే ఇరాన్ అణుకార్యక్రమం అపరిష్కృతంగా ఉండిపోతుంది. దౌత్యప్రయత్నాలు స్తంభించిపోతాయి. ఇరాన్ తన చేతిలో బ్రహ్మాస్త్రంలాంటి హోర్ముజ్‌పై తన సార్వభౌమాధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. అందుకే బెదిరింపులతోపాటు పట్టువిడుపుల అస్త్రం ఉపయోగిస్తున్నాడు. ఇరాన్‌ను నాశనం చేస్తానంటూనే, మా ప్రతినిధులు చర్చల కొనసాగింపు కోరుతున్నారనటంలోనే ట్రంప్ సందిగ్ధావస్థ అర్థమవుతున్నది. ప్రపంచ దేశాలు సంయమనం కోరుతున్నాయి. ఏడు యుద్ధాలు నిలుపుచేశానని నిత్యం చెప్పుకునే ట్రంప్ ఇరాన్‌పైకి లక్ష్యరహితంగా యుద్ధానికి దిగటమే తప్పు. దాన్నుంచి గౌరవప్రదంగా బయటపడితేనే నవంబర్‌లో జరిగే అమెరికన్ కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో పరువు నిలబడుతుంది. మధ్యవర్తులుగా పనిచేసిన పాకిస్థాన్, కటార్, సౌదీఅరేబియా, టర్కీ, ఈజిప్టు ఇప్పుడు తిరిగి చొరవ తీసుకోవాలి.