Rail One App Users Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్..స్క్రీన్షాట్లు, పీడీఎఫ్‌లు చెల్లవు.. రైల్ వన్ యాప్ డిజిటల్ టికెట్లపై రైల్వే శాఖ కఠిన నిబంధన..
Rail One App Users Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్..స్క్రీన్షాట్లు, పీడీఎఫ్‌లు చెల్లవు.. రైల్ వన్ యాప్ డిజిటల్ టికెట్లపై రైల్వే శాఖ కఠిన నిబంధన..
Rail One App Users Alert: భారత రైల్వే శాఖ డిజిటల్ అన్రిజర్వ్డ్ (సాధారణ) టికెట్లను ఉపయోగించే ప్రయాణికులకు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది.రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న డిజిటల్ టికెట్లను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా ఏ మొబైల్ ఫోన్ నుండి అయితే బుక్ చేశారో.. అదే ఫోన్లోని యాప్ ద్వారానే నేరుగా చూపించాలని స్పష్టం చేసింది.
టికెట్ యొక్క స్క్రీన్షాట్లు (Screenshots), పీడీఎఫ్ (PDF) కాపీలు లేదా వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు ఫార్వార్డ్ చేసిన కాపీలను టికెట్ చెకింగ్ సిబ్బంది అంగీకరించబోరని తేల్చి చెప్పింది. వీటిని ప్రయాణానికి సరైన ఆధారాలుగా పరిగణించబోమని.. ఒకవేళ అలా చూపిస్తే టికెట్ లేని ప్రయాణికులుగానే (Without Ticket) భావిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.
డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని.. అంటే ఒకే టికెట్ స్క్రీన్‌షాట్‌ను పలువురు ఉపయోగించి ప్రయాణించే మోసాలను అరికట్టేందుకే ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జూలై 8న తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో స్పష్టం చేసింది. ఇటీవల ఒక ప్రయాణికుడు రైలులో టీటీఈకి వాట్సాప్ స్క్రీన్‌షాట్ చూపించగా.. అధికారులు దానిని తిరస్కరించి అతడికి భారీ జరిమానా విధించిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ అధికారిక ప్రకటనతో స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులు రైలు బయలుదేరక ముందే టికెట్ బుక్ చేసుకోవాలని.. ప్రయాణ సమయంలో టికెట్ బుక్ చేసిన ఒరిజినల్ ఫోన్‌తో పాటు తప్పనిసరిగా అసలు గుర్తింపు కార్డును (Original ID Proof) వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
రైల్వే శాఖ తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఇంటి పెద్ద లేదా ఒకే వ్యక్తి టికెట్లు బుక్ చేసే సందర్భాల్లోనూ.. లేదా ఊర్లలో ఉండే సాంకేతిక పరిజ్ఞానం లేని వృద్ధుల కోసం పట్టణాల్లో ఉండే వారి పిల్లలు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసి వాట్సాప్ ద్వారా పంపేటప్పుడు ఎదురయ్యే సాధకబాధల గురించి నెటిజన్లు రైల్వే శాఖను ప్రశ్నిస్తున్నారు. టికెట్ బుక్ చేసిన వ్యక్తి ప్రయాణంలో లేకపోతే.. ప్రయాణించే ఇతర కుటుంబ సభ్యులకు జరిమానాలు పడటం ఎంతవరకు న్యాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైల్ వన్ యాప్‌లో డిజిటల్ పద్ధతిలో అన్రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేస్తే రైల్వే శాఖ 3 శాతం రాయితీ (Discount) ఇస్తున్నప్పటికీ.. తాజాగా కఠినతరం చేసిన ఈ నిబంధన వల్ల ఆ లాభం కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే ఈ ఆందోళనలపై రైల్వే శాఖ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ప్రకటించలేదు.