Skip to content
జాతీయం వార్తలు

Vijay Questions Police Action: పోలీసులను నమ్మితే నాపైనే నిందలు వేశారు..కరూర్ తొక్కిసలాట కచ్చితంగా రాజకీయ కుట్రే.. తమిళనాడు సీఎం విజయ్ భావోద్వేగం

Prajapaksham 10 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Vijay Questions Police Action: పోలీసులను నమ్మితే నాపైనే నిందలు వేశారు..కరూర్ తొక్కిసలాట కచ్చితంగా రాజకీయ కుట్రే.. తమిళనాడు సీఎం విజయ్ భావోద్వేగం

Vijay Questions Police Action: పోలీసులను నమ్మితే నాపైనే నిందలు వేశారు..కరూర్ తొక్కిసలాట కచ్చితంగా రాజకీయ కుట్రే.. తమిళనాడు సీఎం విజయ్ భావోద్వేగం

Vijay Questions Police Action: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట (Karur Stampede) కచ్చితంగా రాజకీయ కుట్రేనని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్‌లో పర్యటించిన ఆయన.. నాటి దురదృష్టకర ఘటనను గుర్తుచేసుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు ర్యాలీకి ఊహించని స్థాయిలో రద్దీ వస్తోందని తెలిసినప్పటికీ.. పోలీసులు ఆ సభను మధ్యలోనే ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాను పోలీసులను నమ్మి ప్రచారానికి వెళ్తే.. చివరకు జరిగిన మరణాలకు తననే నిందించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక మనిషి ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. జీవితంలో కొన్ని బాధాకరమైన క్షణాలను ఎదుర్కోక తప్పదన్నారు. తన రాజకీయ ప్రయాణంలో కరూర్ ఘటన అలాంటిదేనని విజయ్ పేర్కొన్నారు. ఆ తొక్కిసలాటలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు. ఆ రోజు ర్యాలీలో రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులకు అనిపించినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది లేదా శాంతిభద్రతల దృష్ట్యా సమావేశాన్ని రద్దు చేయాల్సింది. వారికి అన్ని హక్కులూ ఉన్నాయి కదా! కానీ అవేవీ చేయకుండా వారు చోద్యం చూశారన్నారు.

బహుశా అలా చేయమని నాటి డీఎంకే ప్రభుత్వం నుండి వారిపై ఒత్తిడి ఉండి ఉంటుంది. రద్దీని నియంత్రించగలరని నేను పోలీసులను నమ్మాను. కానీ నా వల్లే మరణాలు జరిగాయని నాపై నిందలేశారు. ఘటన తర్వాత నేను పారిపోయానని ప్రత్యర్థులు బురదజల్లారు. కానీ నేను పారిపోలేదు, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ స్పష్టం చేశారు. కరూర్ విషాదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరఫున ఒక స్మారకాన్ని నిర్మిస్తానని ప్రకటించారు.

ఇదే వేదికపై నుంచి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల జరిగిన రాజకీయ ప్రయత్నాలపై కూడా సీఎం విజయ్ ఘాటుగా స్పందించారు. ప్రజలు తనవైపే ఉన్నారని.. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా తమను అధికారంలో నుంచి దించలేరంటూ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాయని..కానీ తమ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పేరే వినిపించదని చెప్పారు. ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా.. నిజాయతీగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గతేడాది (2025) సెప్టెంబరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కరూర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. కరూర్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన అర్హులైన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.