Skip to content
జాతీయం వార్తలు

Alcohol-Based Medicines: 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మందులకు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Prajapaksham 10 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Alcohol-Based Medicines: 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మందులకు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Alcohol-Based Medicines: 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మందులకు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Alcohol-Based Medicines: దేశంలో మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు.. ముఖ్యంగా యువత, చిన్నారుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న నోటి ద్వారా తీసుకునే (ఓరల్) మందుల విక్రయానికి ఇకపై గుర్తింపు పొందిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి కానుంది. ఇందుకోసం ప్రభుత్వం డ్రగ్స్ రూల్స్ 1945కు కీలక సవరణలు చేసింది.

ఈ సవరణలో భాగంగా 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ కలిగి ఉండి.. 30 మిల్లీలీటర్ల (30 ml) కంటే పెద్ద ప్యాక్‌లు లేదా సీసాలలో విక్రయించే అన్ని మందులను భారత ప్రభుత్వం షెడ్యూల్ H1′ (Schedule H1) కేటగిరీ పరిధిలోకి చేర్చింది. ఈ నిబంధన వల్ల మార్కెట్లో లభించే అనేక రకాల దగ్గు సిరప్‌లు (Cough Syrups), ఆయుర్వేద ఆసవాలు, హెల్త్ టానిక్‌లపై నేరుగా ప్రభావం పడనుంది. గతంలో కేవలం మెడికల్ షాపునకు వెళ్లి పేరు చెబితే సులభంగా లభించే దగ్గు సిరప్‌లు, ఇకపై డాక్టర్ రాసిస్తే తప్ప విక్రయించడానికి వీల్లేదు.

కఠినమైన రికార్డుల నిర్వహణ: షెడ్యూల్ H1 పరిధిలోకి వచ్చే మందులను విక్రయించే ఫార్మసీలు లేదా కెమిస్ట్ దుకాణాలు కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ మందులను కొనుగోలు చేసిన రోగుల వివరాలు, డాక్టర్ పేరు, విక్రయించిన తేదీతో కూడిన ప్రత్యేక రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలి. సదరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ల నకళ్లను భద్రపరచాలి. అలాగే ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఈ రికార్డులను సమర్పించాల్సి ఉంటుంది.

ఇటీవలి కాలంలో ఆల్కహాల్ ఆధారిత మందులు, కోడైన్ కలిగిన దగ్గు సిరప్‌లను చాలామంది మత్తు పదార్థాలుగా విరివిగా ఉపయోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల నుంచి వీటి భారీ అక్రమ రవాణా కూడా వెలుగులోకి వచ్చింది. వీటన్నింటికీ మించి, గత సంవత్సరం (2025లో) రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దగ్గు సిరప్‌ల దుర్వినియోగం కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ నిబంధనకు సంబంధించిన ముసాయిదాను (Draft) ప్రభుత్వం 2025 అక్టోబర్‌లోనే ప్రజల ముందుకు తీసుకువచ్చి.. ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. దీనిపై ఎవరి నుంచీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో.. ప్రభుత్వం ‘డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’ (DTAB) తో తుది సంప్రదింపులు జరిపి దీనిని అధికారిక చట్టంగా మార్చింది.

ట్యాగ్‌లు: Medicines Schedule H1 Update