శ్రమతో ఆర్జించే వారిదే ‘అర్జక్ సంఘ్’ : రామ్ స్వరూప్ వర్మ
Ram Swaroop Verma
(22 ఆగస్టు రామ్ స్వరూప్ వర్మ జయంతి)
దేశంలోని ఉత్తర దక్షిణ రాష్ట్రాలను నిశితంగా పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో విద్యావంతులు ఎక్కువ. పెరియార్, గోరా, కందుకూరి, త్రిపురనేని, కోవూర్ వంటి వారి కృషితో దక్షిణాన చైతన్యమెక్కువ. హేతువాదులెక్కువ. నిజమే! కానీ ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది సంఘ సంస్కర్తలు, హేతువాదులు, బౌద్ధ అనుయాయులు వచ్చారు. వారు చేయగలిగినంత చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాలలో జనాన్ని చైతన్యవంతుల్ని చేశారు. అయినా కూడా వారి ప్రభావం ఏమాత్రం లేకుండా జనాన్ని మూఢత్వంలో ముంచి, దౌర్జన్యాలు చేస్తూ అక్రమ మార్గంలో అధికార పీఠాలు ఆక్రమించినవారిని మనం ఇటీవల చూస్తున్నాం. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ నుండే రామ్‌స్వరూప్ వర్మ, లలైసింగ్‌యాదవ్‌లు వచ్చారు. బీహార్ నుండి బాబు జగదేవ్‌ప్రసాద్ వచ్చాడు. బ్రాహ్మణిజం ఆధిపత్యాన్ని తగ్గించడానికి, బహుజనులు అధికారం చేపట్టడానికి కావల్సిన నేపథ్యాన్ని వారు సమకూర్చారు. రామ్‌స్వరూప్‌వర్మ, బాబు జగదేవ్‌ప్రసాద్‌లు స్వయంగా రాజకీయాల్లోకి దూకి, ఆయా రాష్ట్రాల్లో మంత్రులుగా కొంతకాలం పరిపాలన సాగించారు కూడా! వీరిలో రామ్‌స్వరూప్ వర్మది ప్రత్యేమైన కృషి. జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ కర్మఫలితం వంటి కల్పించిన మాటలతో, తప్పుడు సిద్ధాంతాలతో జనాన్ని భయానికి గురిచేసి, లేని దేవుణ్ణి ప్రతిష్టాపించి, వారు చెప్పిన మాటలన్నీ భగవంతుడు చెప్పాడని బొంకుతూ, కష్టపడకుండా దోచుకుతింటున్న బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిర్దంద్వంగా నిరసించినవాడు రామ్‌స్వరూప్ వర్మ. మనుస్మృతిని చీల్చి చెండాడుతూ పుస్తకాలు రాసి, రామ్‌చరిత్‌మానస్‌ను (రామాయణాన్ని) బహిరంగంగా తగులబెట్టి, తన ఆలోచనలకు ఉద్యమ రూపమిచ్చిన క్రియాశీలి. ఇప్పటిదాకా మానవుడి కేంద్రంగానే విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయని, ఇకముందు కూడా అలాగే జరుగుతుందనీ దేనిలోనూ ఏ శక్తీ ఏ మహత్తూ లేదని, ఏ మతమూ ఏ దేవుడూ లేడని కరాఖండిగా చెప్పి, కష్టజీవుల పక్షాన నిలిచిన మేధావి, మానవవాది రామ్‌స్వరూప్ వర్మ.
కులాల్ని, వర్గాల్ని, వర్ణాల్ని, మతాల్ని అందులోని శాఖల్ని త్యజించి అన్నింటికీ అతీతంగా మానవీయ విలువల్ని నిలుపడం కోసం ఒక ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటు చేశాడు రామ్‌స్వరూప్ వర్మ. దానిపేరు అర్జక్ సంఘ్ అంటే శారీరక శ్రమతో మాత్రమే డబ్బు సంపాదించుకుని జీవనం సాగించే వారి సంఘం. శారీరక శ్రమ సౌందర్యానికి అత్యున్నతమైన గౌరవమిచ్చే సంఘం. వర్ణవ్యవస్థను కాలరాసి, వైజ్ఞానిక అవగాహనతో జన్యుశాస్త్రం రుజువుపరిచిన “మనుషులంతా ఒక్కటే” నన్న భావనతో అందరినీ కలుపుకుపోయే సంఘం అర్జక్ సంఘ్! అర్జక్ అంటే ఆర్జించేవాడు. కూర్చుని దొంగమాటలు చెప్పి, డబ్బు లాగేవారు కూడా ఆర్జిస్తున్నారు కదా? అంటే.. వారు ఈ సంఘంలో సభ్యులు కారు. ఎంతటి మేధావి అయినా, ఎంత గొప్ప ప్రణాళికలు రూపొందించినా అవి వాస్తవ రూపం దాల్చాలంటే శ్రమశక్తి తోడు కావాల్సిందే! ఆలోచనలు ఆలోచనలుగా ఉంటే లాభం ఉండదు. అవి వాస్తవ రూపాలు సంతరించుకుంటేనే సమాజానికి ఉపయోగం! అందువల్ల, అర్జక సంఘంలో కష్టపడి, చెమటోడ్చి పనిచేసే కర్షక, కార్మిక వర్గాల వారికే ప్రాధాన్యత ఉంటుంది. శ్రమకూ, మానవీయ విలువలకూ ప్రాధాన్యమిచ్చే ఆలోచనాపరులు కూడా ఈ సంఘంలో భాగస్వాములు కావచ్చు. అయితే, వారు తమతమ కులమతాల్ని, ఆర్థికస్థోమతల్ని పక్కకు నెట్టి, మానవ శ్రేయస్సు కోరుకునే స్వేచ్ఛా జీవులు కావాలి! అన్న విషయం రామ్‌స్వరూప్ వర్మ తన సంఘానికి సంబంధించిన ‘బైలాస్’లో రాసుకున్నాడు. 1970 తొలినాళ్ళలో ప్రారంభమైన ఈ సంఘాన్ని ఆయన అనుయాయులు ఈనాటికీ క్రియాశీలంగానే ఉంచారు. ఆ సంఘం వారు అధికారికంగా నిర్వహించుకుంటున్న యూ ట్యూబ్ ఛానెల్ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. హేతువాదాన్ని, శాస్త్రీయ అవగాహనను, మానవ వాదాన్ని ప్రచారం చేస్తూనే ఉంది.
రామ్‌స్వరూప్ వర్మ చెప్పినదాన్ని బట్టి “బ్రాహ్మణిజం ఒక చెట్టు లాంటిది. పునర్జన్మ దాని తల్లివేరు. మనిషి చేతిలో ఏమీలేదు. అంతా విధిరాత అని ప్రగాఢంగా నమ్మే ఆలోచనా ధోరణి (FATALISM) ఆ చెట్టు కాండమైతే, వర్ణ వ్యవస్థ ఆ వృక్షానికున్న శాఖలు. దానిమీదే కులం ఆకులుగా మొలుస్తాయి. అగ్రవర్ణం, నిమ్నవర్గం లాగా కొన్ని పుష్పాలు వృక్షం అగ్రభాగాన పూస్తే, కొన్ని పువ్వులు కింది భాగంలో అంచెలంచెలుగా పూస్తాయి. శ్రమదోపిడీ ఈ వృక్షపు ఫలాలు!” భారతదేశం లో శతాబ్దాలుగా వేళ్ళూనుకుని ఉన్న బ్రాహ్మణిజపు స్వభావాన్ని రామ్‌స్వరూప్‌వర్మ సంకేతాత్మకంగా, సందేశాత్మకంగా ఇలా వర్ణించి చెప్పాడు. వైజ్ఞానిక అవగాహనతో సమాజాన్ని అవలోకించే వారికి వర్మ వర్ణన బాగా నచ్చుతుంది. ఇది మాత్రమేగాక, ఆయన మరొక విషయం కూడా నిర్మొహమాటంగా చెప్పాడు. మనకు కొందరు సంఘ సంస్కర్తలుంటారు. వారు ఆకులు పూలు పీకేద్దామని ప్రయత్నిస్తుంటా రు. దానివల్ల ఫలితం ఉండదు కదా? ఆకులు మళ్ళీ మొలుస్తుంటాయి. పూలు మళ్ళీ పూస్తుంటాయి. శ్రమదోపిడి ఫలా లు కాస్తూనే ఉంటాయి. మరి ఎలాగా? అంటే సహా ఆ వృక్షాన్ని ఊడబెరికితే గాని, లేదా నరికితే గాని సమసమాజ స్థాపన జరగదు! రామ్ స్వరూప్ వర్మ (22 ఆగస్టు 1923— ఆగస్టు 1998) యు.పి, కాన్పూర్ జిల్లా , గౌరికరన్ గ్రామంలో కుర్మిజాతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. తండ్రి వంశ్ గోపాల్, తల్లి సుఖియా. విద్యార్థి దశలోనే వర్మకు సియాదులారీ అనే అమ్మాయి తో పెద్దలు పెండ్లి చేశారు. ఆ అమ్మాయి రెండేళ్ళకే చనిపోయింది. వర్మ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. తనను తాను బహుజన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, మానవవాదిగా, రచయితగా, తత్త్వవేత్తగా తీర్చిదిద్దుకుంటూ, సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాడు. ఎం.ఎ.; ఎల్‌ఎల్‌బి డిగ్రీలు తీసుకున్నా లాయర్‌గా ప్రాక్టీసు చేయలేదు. ఐ.ఎ.ఎస్ పరీక్ష ఉత్తీర్ణుడై ఉండి కూడా ఇంటర్వ్యూకు పోలేదు. స్వేచ్ఛగా జనజీవితంతో మమేకమై పనిచేయాలనుకున్నాడు. తర్వాత కొంత కాలానికి ఆచార్య నరేంద్రదేవ్ తోనూ, డా.రామ్ మనోహర్ లోహియాతోనూ పరిచయాలు పెరిగి, సోషలిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి పలుమార్లు ఎన్నికయ్యాడు. చరణ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1967లో ఆయన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయ్యాడు. అప్పటికి ఆయనకు ఒక విషయం పూర్తిగా అర్ధమైంది. సామాజిక, సాంస్కృతిక రంగాలలో సమానత్వం సాధించకుండా రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించడం కుదరదని! ఫలితంగానే అర్జక్ సంఘ్ స్థాపనకు పూనుకున్నాడు.
1972లో వర్మ సోషలిస్ట్ పార్టీ వదిలి, తనే ‘సమాజ్‌దళ్’ అనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాడు. దానికి అనుబంధంగా ‘అర్జక్ సాప్తాహిక్’ అనే హిందీ వారపత్రిక ప్రచురణ చేపట్టాడు. అదే సమయంలో బీహార్‌లో బాబు జగదేవ్ ప్రసాద్ సోషలిస్ట్ పార్టీ వదిలి ‘శోషిత్ దళ్ ’ పేరుతో కొత్త పార్టీనీ, అనుబంధంగా ‘శోషిత్ సాప్తాహిక్ ’ హిందీ వార పత్రికను ప్రారంభించాడు. ఈ ఇద్దరి ఆలోచనలు, వారు ప్రచురిస్తున్న పత్రికల కథనాలు, చేపట్టిన కార్యక్రమాలు ఒకే విధంగా ఉండడంతో 1972లో ఇద్దరూ కలిసిపోయారు. ఇద్దరూ కలిసి సంయుక్తంగా “శోషిత్ సమాజ్ దళ్” పేరుతో పార్టీ ప్రారంభించారు. దానికి రామ్‌స్వరూప్‌వర్మ చైర్ పర్సన్‌గా, జగదేవ్ ప్రసాద్ కార్యదర్శిగా పనిచేయనారంభించారు.
రామ్ స్వరూప్ వర్మ రచనలన్నీ హిందీలో ప్రకటించాడు. అందులో “ మానవ వాది ప్రశ్నోత్తం” “మానవ వాద్ వర్సెస్ బ్రాహ్మణ్‌వాద్ ”, “మనుస్మృతి రాష్ర్ట్‌క కళింక్”, “నిరాదర్ కైసే మిటే”, “అఛూతోంకి సమస్యా అవుర్ సమాధాన్”, “అర్జక్ సంఘ్ సిద్ధాంత్ కర్తవ్య విధాన్ కార్యక్రమ్ ” వంటి శీర్షికలతో చాలా పుస్తకాలు ప్రకటించారు. 1. పుట్టుక, పెళి, చావు వంటి వాటిల్లో బ్రాహ్మణ పురోహితుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించాలి. 2.ఆచారాల పేరుతో ఆర్భాటాలు ఆపేయాలి. ౩.నిజాల్ని జీర్ణించుకుని వాస్తవంలో బతకాలి. 4. మొత్తానికి మొత్తంగా బ్రాహ్మణిజాన్ని తరిమికొట్టాలి. 5.అంతమాత్రం చేత అగ్రవర్ణం వారిని దేషించకూడదు 6.అందరినీ సమాన స్థాయి గల మనుషులుగా గౌరవించుకోవాలి వంటి విషయాలన్నీ రామ్‌స్వరూప్ వర్మ తన అర్జక్ సంఘ్ బైలాస్‌లో పొందుపరిచాడు. బుద్ధుడి ఆలోచనలకు, బోధనలకు ఆకర్షితుడైన రామ్‌స్వరూప్ వర, వాటిని ఆధునిక వైజ్ఞానిక కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తను అభిమానించే డా.బి.ఆర్.అంబేద్కర్ చివరి దశలో హిందూ మతం వదిలి బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆయ న ఇంకొంత కాలం జీవించి ఉంటే ‘నవయానం’లో అనువైన మార్పులు, చేర్పులు చేసి ఉండేవారేమోనన్నది వర్మ అభిప్రా యం.