Skip to content
జాతీయం › వార్తలు

SC On Delhi Rape Cases: మహిళలపై నేరాలకు పాల్పడేవారి గుండెల్లో భయం పుట్టించాలి.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

jagan 05 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
SC On Delhi Rape Cases: మహిళలపై నేరాలకు పాల్పడేవారి గుండెల్లో భయం పుట్టించాలి.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court

SC On Delhi Rape Cases: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళలు, బాలికలపై వరుసగా వెలుగుచూస్తున్న లైంగిక దాడుల ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై నేరాలకు పాల్పడే వారిలో చట్టం పట్ల భయం కలిగేలా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకుండా ముందుగానే అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యం కావాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇటీవల నమోదైన అత్యాచార ఘటనలపై సుమోటో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రతి మహిళ రాత్రి 11 గంటల సమయంలోనూ రోడ్లపై నడవగలిగేలా, మెట్రోలో లేదా ఇతర ప్రజా రవాణాలో ప్రయాణించగలిగేలా సురక్షిత వాతావరణం ఉండాలని ధర్మాసనం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మహిళలు సురక్షితంగా లేరనే భావన నెలకొనడం ఆందోళనకరమని తెలిపింది. మహిళల భద్రతకు సంబంధించి కాగితాలపై పథకాలు, నిబంధనలు ఉండటం మాత్రమే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలవుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.

“నేరం జరిగిన తర్వాత ఏం చేశారన్నది కాదు.. అసలు నేరం జరగకుండా ఎలా అడ్డుకున్నారన్నదే ముఖ్యం” అనే దిశగా కోర్టు పోలీసులకు సూచనలు చేసింది. లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న గూండాలు, సంఘవ్యతిరేక శక్తుల్లో పోలీసుల పట్ల భయం ఏర్పడాలని పేర్కొంది. నేరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాన్ని నేరస్థుల్లో కలిగించకుండా ఇలాంటి నేరాలను సమర్థంగా అరికట్టడం సాధ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వరుసగా నమోదైన అత్యాచారం, లైంగిక దాడుల కేసులపై సుమోటోగా కేసు నమోదు చేసింది. దిల్లీలోని ఆస్తా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, స్వరూప్ నగర్‌లో టీనేజీ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, అనంతరం ఆమె హత్యకు గురైన ఘటన, గ్రేటర్ నోయిడా నుంచి దిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిని కోర్టు తీవ్రంగా పరిగణించింది. స్లీపర్ బస్సు 47 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినప్పటికీ దాన్ని అధికారులు అడ్డుకోలేకపోవడంపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.

ఈ ఘటనలు కేవలం వ్యక్తిగత నేరాలుగా కాకుండా ప్రజా భద్రత, పోలీసింగ్ వ్యవస్థలోని లోపాలను కూడా సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు తన సెప్టెంబర్ 28 ఆదేశాల్లో పేర్కొంది. పార్కులు, రహదారులు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వంటి బహిరంగ ప్రదేశాలు తగిన వెలుతురు లేకపోవడం, సీసీటీవీ నిఘా లోపించడం, పోలీసు పెట్రోలింగ్ తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రమాదకర ప్రాంతాలుగా మారకూడదని స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా దిల్లీలోని ప్రతి పోలీసు జిల్లాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, మహిళలు, బాలికలకు ప్రమాదకరంగా మారే ప్రాంతాలను గుర్తించాలని కోర్టు ఆదేశించింది. పార్కులు, ఒంటరి ప్రాంతాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, విద్యాసంస్థల పరిసరాలు తదితర ప్రాంతాల్లో భద్రతా లోపాలను గుర్తించి వాటికి అనుగుణంగా పెట్రోలింగ్, భద్రతా ఏర్పాట్లు పెంచాలని సూచించింది. సున్నిత ప్రాంతాలకు సంబంధించి జిల్లా వారీగా వల్నరబిలిటీ మ్యాప్ సిద్ధం చేయాలని కూడా ఆదేశించింది.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో లైటింగ్, సీసీటీవీ వ్యవస్థలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పనిచేయని కెమెరాలు, లైట్లను వెంటనే మరమ్మతు చేయాలని, అవసరమైన చోట అదనపు సీసీటీవీలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. మెట్రో స్టేషన్లు, బస్‌స్టాప్‌లు, బస్ టెర్మినళ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా రవాణా ప్రాంతాల్లోనూ ఇలాంటి భద్రతా ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేసింది.

మహిళల భద్రతకు సంబంధించిన పథకాలు, హెల్ప్‌లైన్లు, పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్‌డెస్క్‌లు, వన్‌స్టాప్ సెంటర్లు వాస్తవంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయంపై సమగ్ర నివేదికలు సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. కేవలం పథకాలు ఉన్నాయని చెప్పడం కాకుండా అవి ఎంత మేర పనిచేస్తున్నాయి, ఎంతమంది వాటిని ఉపయోగిస్తున్నారు, స్పందన సమయం ఎంత వంటి వివరాలను సమర్పించాలని పేర్కొంది.

ఇక ఈ కేసుల్లో విచారణలు కూడా వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దిల్లీ హైకోర్టు సంబంధిత కేసులను ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులకు కేటాయించి, విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించింది.

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి ప్రభుత్వాలు, పోలీసులు కేవలం ఘటన జరిగిన తర్వాత స్పందించే విధానాన్ని కాకుండా ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. చట్టం అమలు సమర్థంగా ఉండటంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో వెలుతురు, నిఘా, పెట్రోలింగ్, వేగవంతమైన స్పందన వంటి మౌలిక భద్రతా వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కోర్టు ఆదేశాలు పేర్కొంటున్నాయి.