SLBC క్లిష్ట దశ దాటేశాం.. సొరంగంలో షియర్ జోన్ దాటిన తవ్వకాలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
పనుల్లో వేగం పెంచేందుకు మార్గం సుగమం… 2028 జూన్ నాటికి నీటి సరఫరా లక్ష్యం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన దశను అధిగమించామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలమైన షియర్ జోన్ సురక్షితంగా దాటడంతో ఇక తవ్వకాల వేగం పెంచేందుకు మార్గం సుగమమైందన్నారు.
బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఎస్ఎల్బీసీ పురోగతిని మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగం పనులను మరింత వేగవంతం చేసేందుకు అదనపు యంత్రాలను సమకూర్చి, తవ్విన పదార్థాలను బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగంతో పాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
గడిచిన ఐదారు నెలల్లో సొరంగ తవ్వకాలు సుమారు 700 మీటర్లు ముందుకు సాగాయని అధికారులు తెలిపారు. అవుట్లెట్ వైపు 450 మీటర్లు, ఇన్లెట్ వైపు 250 మీటర్ల పురోగతి నమోదైందన్నారు. 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో సుమారు 79 శాతం పనులు పూర్తి కాగా, మరో 9.1 కిలోమీటర్ల తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించారు.
అత్యంత ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటడం ప్రాజెక్టులో కీలక ముందడుగని ఉత్తమ్ పేర్కొన్నారు. టన్నెల్లో రెండు వైపులా జరుగుతున్న తవ్వకాలు 2028 మే, జూన్ నాటికి కలిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తవ్వకాలతోపాటు స్ప్రే లైనింగ్ పనులు కొనసాగుతున్నందున బ్రేక్ సమయానికి లైనింగ్‌లో అధిక భాగం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రధాన సొరంగంతోపాటు 7.1 కిలోమీటర్ల టన్నెల్ 2, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇతర అనుబంధ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. 2028 జూన్ నాటికి నీటిని అందించే లక్ష్యానికి అనుగుణంగా పక్కా కార్యాచరణ రూపొందించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
బలహీన శిలల నేపథ్యంలో నెమ్మదిగా సాగిన తవ్వకాలు : కల్నల్ పరీక్షిత్ మెహ్రా
బలహీన నేల, రాక్ బరస్ట్ వంటి ప్రమాదాల నేపథ్యంలో ఇన్లెట్ వద్ద తొలి నెలల్లో తవ్వకాలను నెమ్మదిగా చేపట్టినట్లు ఆర్మీ టన్నెల్ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు. టిబిఎం చిక్కుకున్న ప్రాంతాన్ని చుట్టి వెళ్లే తవ్వకాల్లో బలహీన శిలల మండలం ఎదురైనట్లు వివరించారు.
ఈ ప్రాంతంలో 140 మి.మీ. సీమ్స్ పైపులతో అంబ్రెల్లా కేనపీ ఏర్పాటు చేసి, రీ ఇన్ఫోర్స్డ్ రిబ్స్, దశల వారీ తవ్వకాలు, ప్రోబ్ డ్రిల్లింగ్, అదనపు రక్షణ చర్యలతో పనులు కొనసాగించినట్లు తెలిపారు. ప్రస్తుతం శిలల పరిస్థితి మెరుగుపడటంతో సాధారణ వేగంతో పనులు చేపట్టే అవకాశం ఏర్పడిందన్నారు.
ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు ఎనిమిది మీటర్ల పురోగతి నమోదవుతోందని అధికారులు మంత్రికి వివరించారు. సాధారణంగా రోజుకు 7-7.5 మీటర్ల పురోగతి ఉంటోందని, కొన్ని రోజుల్లో 10 మీటర్లకు చేరిందన్నారు.
అవుట్లెట్ వద్ద మూడు భుజాల డ్రిల్లింగ్ బూమర్ ఇప్పటికే పనిచేస్తుండగా, మరో బూమర్‌ను అక్టోబర్‌లో ఇన్లెట్‌కు తరలించనున్నారు. జర్మనీ నుంచి తెప్పిస్తున్న లోకోమోటివ్ అక్టోబర్ నెలాఖరుకు అందుబాటులోకి రానుందన్నారు. తద్వారా సొరంగంలో 21 కిలోమీటర్ల వరకు దూరం నుంచి తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం 20–24 గంటలకు తగ్గిన నిర్మాణ సైకిల్‌ను అదనపు యంత్రాలు, మెరుగైన రవాణా వ్యవస్థతో సుమారు 10 గంటలకు తగ్గించవచ్చని అంచనా ఉందని పేర్కొన్నారు.