Volkswagen Layoffs: లక్ష ఉద్యోగాల కోత.. 4 ప్లాంట్ల మూసివేత..చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంలో వోక్స్వ్యాగన్..ఉద్యోగుల నుంచి వెలువెత్తుతున్న నిరసనలు..
Volkswagen Layoffs: లక్ష ఉద్యోగాల కోత.. 4 ప్లాంట్ల మూసివేత..చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంలో వోక్స్వ్యాగన్..ఉద్యోగుల నుంచి వెలువెత్తుతున్న నిరసనలు..
Volkswagen Layoffs: జర్మనీకి చెందిన ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం వోక్స్వ్యాగన్ భారీ ఎత్తున ఉద్యోగాల కోత విధిస్తోందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించడంతో పాటుగా.. జర్మనీలోని నాలుగు ప్రధాన తయారీ ప్లాంట్లను శాశ్వతంగా మూసివేయాలని సంస్థ యాజమాన్యం యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వోక్స్వ్యాగన్ మొత్తం సిబ్బందిలో ఇది 16 శాతానికి సమానం కావడంతో కార్మికులలో తీవ్ర ఆందోళనతో కూడిన నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భారీ పునర్నిర్మాణ (Restructuring) ప్రణాళికపై తుది నిర్ణయం తీసుకునేందుకు వోక్స్వ్యాగన్ పర్యవేక్షక బోర్డు జర్మనీలోని వోల్ఫ్స్బర్గ్ ప్రధాన కార్యాలయంలో నేడు అత్యవసరంగా సమావేశమైంది. ఈ ప్రణాళిక ప్రకారం జర్మనీలోని హానోవర్, ఎమ్డెన్, జ్వికావ్, ఆడి (Audi) బ్రాండ్‌కు చెందిన నెకార్సుల్మ్ అనే నాలుగు కీలక ప్లాంట్లను పూర్తిగా మూసివేయాలని బోర్డు భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీకి చెందిన డజనుకు పైగా ప్లాంట్ల వద్ద వేలాది మంది కార్మికులు ఇప్పటికే వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకవేళ ప్లాంట్ల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే యాజమాన్యంతో భారీ ఘర్షణ తప్పదని జర్మనీకి చెందిన ప్రముఖ కార్మిక సంఘం ఐజీ మెటల్ హెచ్చరించింది.
పెరుగుతున్న వ్యయ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో తీవ్రమైన పోటీని తట్టుకోలేక వోక్స్‌వ్యాగన్‌తో పాటు కొన్ని ఇతర జర్మన్ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను విదేశాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ప్లాంట్లలో సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతున్న ఉత్పత్తి వల్లే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కంపెనీ సీఈఓ ఆలివర్ బ్లూమ్ సమర్థించుకుంటున్నారు. ముఖ్యంగా చైనా ఆటోమొబైల్ రంగం నుండి వస్తున్న విపరీతమైన పోటీ.. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల ఎదురవుతున్న ముప్పులను అధిగమించాలంటే వ్యయ నియంత్రణే ఏకైక మార్గమని యాజమాన్యం వాదిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో రారాజుగా ఉన్న వోక్స్వ్యాగన్ సొంత దేశం జర్మనీలోనే ప్లాంట్లను మూసివేసే పరిస్థితి రావడం ప్రపంచవ్యాప్త పారిశ్రామిక రంగాన్ని కుదిపేస్తోంది.