Tamil Nadu Politics: కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది.. INDIA కూటమిలో చేరేది లేదని తేల్చి చెప్పిన స్టాలిన్ పార్టీ..
Tamil Nadu Politics: కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది.. INDIA కూటమిలో చేరేది లేదని తెలిపిన స్టాలిన్ పార్టీ..
Tamil Nadu Politics: ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే (DMK) పార్టీల మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించేందుకు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధినేత తోల్ తిరుమావళవన్ చేసిన ప్రయత్నాలు తాజాగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK), విపక్ష డీఎంకే పార్టీలను జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిలోకి తీసుకురావడానికి ఆయన రాయబారం నడిపారు.
ఇందులో భాగంగా కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహా రాజీ ఫార్ములాను ఆయన తెరపైకి తెచ్చారు. కేరళ, బెంగాల్‌లలో కూటమి భాగస్వామ్య పక్షాలు రాష్ట్ర స్థాయిలో పరస్పరం శత్రువులుగా తలపడుతున్నప్పటికీ.. కేంద్ర స్థాయిలో మాత్రం ఇండియా కూటమిలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయని.. అదే విధానాన్ని తమిళనాడులోనూ అమలు చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు.
కేంద్రంలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే జాతీయ కూటమి పటిష్ఠంగా ఉండటం అవసరమని.. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి రాజకీయాలు వేరువేరని పేర్కొంటూ ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు తెలిపింది. అయితే, డీఎంకే మాత్రం ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందని.. దానిని తాము ఎప్పటికీ మరువలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మారిన ప్రస్తుత రాజకీయ సమీకరణాల మధ్య అలాంటి ద్వంద్వ విధానంలో కలిసి పనిచేయడం అస్సలు సాధ్యం కాదని స్టాలిన్ పార్టీ తేల్చి చెప్పింది.
ఈ విషయమై డీఎంకే ఎంపీ గణపతి పీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కేవలం ఒకటి రెండు మంత్రి పదవుల కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే (TVK) తో చేతులు కలిపి కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ తన తాత్కాలిక ప్రయోజనాల కోసమే పాకులాడుతుంది తప్ప ఇండియా కూటమి యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించదని మండిపడ్డారు.
ఇప్పుడు తమ స్వార్థం కోసం అంతా చేసి.. వీసీకే అధినేతను దూతగా పంపి డీఎంకేను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేరళ, పశ్చిమ బెంగాల్ మోడల్ తమిళనాడులో ఎంతమాత్రం పనిచేయదని.. వీసీకే చేస్తున్న ఈ ప్రతిపాదనను తమ పార్టీ అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని.. ఒకవేళ భవిష్యత్తులో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భావించినా దానికి చాలా సమయం పడుతుందని ఆయన తేల్చి చెప్పారు.