Bangkok Pub Fire: బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. విషపూరిత పొగ ముంచెత్తడంతో 27 మంది దుర్మరణం.. 63 మందికి గాయాలు
Bangkok Pub Fire: బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. విషపూరిత పొగ ముంచెత్తడంతో 27 మంది దుర్మరణం.. 63 మందికి గాయాలు
Bangkok Pub Fire: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక ప్రముఖ పబ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ భయంకర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకుని కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 63 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఆదివారం రాత్రి వీకెండ్ కావడంతో ఉత్తర బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌కు భారీ సంఖ్యలో యువతీ యువకులు వచ్చారు. పబ్ లోపల స్టేజీపై కళాకారులు లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో.. అక్కడి ప్రధాన సర్క్యూట్ బ్రేకర్ వద్ద నుంచి హఠాత్తుగా దట్టమైన పొగ రావడం కొందరు గమనించారు. వారు అప్రమత్తమయ్యే లోపే పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించి, పబ్ అంతటా విద్యుత్ సరఫరా (పవర్ కట్) నిలిచిపోయింది. కారు చీకట్లు కమ్ముకోవడంతో పాటు క్షణాల వ్యవధిలోనే మంటలు పబ్ లోపల ఉన్న పైకప్పు (రూఫింగ్) మరియు ఇతర భాగాలకు వేగంగా వ్యాపించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే లోపల ఉన్నవారంతా ప్రాణభయంతో కేకలు వేస్తూ ప్రధాన ద్వారం వైపు పరుగులు తీశారు. అయితే లోపల పూర్తిగా చీకటిగా మారడం, ఎగ్జిట్ దారులు సరిగ్గా కనిపించకపోవడం, దట్టమైన పొగ ముంచెత్తడంతో చాలామంది బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని.. సుమారు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరణించిన 27 మందిలో ఎక్కువ శాతం మృతదేహాలను పబ్ లోపలి టాయిలెట్లకు సమీపంలోనే రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. మంటలు, వేడి నుండి ప్రాణాలు దక్కించుకునే ఆఖరి ప్రయత్నంలో వారంతా టాయిలెట్ల వైపు పరిగెత్తినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. బాధితులు కాలిన గాయాల కంటే కూడా దట్టమైన విషపూరిత పొగను పీల్చడం వల్లే ఊపిరాడక ఎక్కువ మంది అక్కడికక్కడే కన్నుమూశారని వైద్యులు ధృవీకరించారు.
పబ్ లోపలి పైకప్పునకు అలంకరణ కోసం వాడిన ఫోమ్, ప్లాస్టిక్ వంటి సౌండ్ ప్రూఫింగ్ సామగ్రి తగలబడటంతో విపరీతమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలైందని, అది పీల్చిన కొద్ది నిమిషాల్లోనే బాధితులు స్పృహ తప్పి పడిపోయారని అధికారులు వివరించారు. ఈ ఘోర ప్రమాదంపై థాయ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.