అమెరికా (యుఎస్ఎ) @ 250
అమెరికా (యుఎస్ఎ) @ 250 ( Image Souce: Wikipedia)
ప్రపంచంలో నెం.1దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యుఎస్ఎ) గ్రేట్ బ్రిటన్ నుంచి తన స్వాతంత్య్ర 250వ జన్మదినాన్ని ఈనెల 4వ తేదీన కడువేడుకగా, కనులకు విందుగొలిపే కార్యక్రమాలతో అట్టహాసంగా జరుపుకుంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో అధ్యక్షుడిగా ఉండే అదృష్టం డోనాల్డ్ ట్రంప్‌కు దక్కింది. 250 ఏళ్ల క్రితం 13కాలనీలు తిరుగుబాటు చేసి తాము ఇంకెంతమాత్రం బ్రిటిష్ సింహాసనానికి లొంగి ఉండబోమని ప్రకటించిన 250సంవత్సరాలనాటి చరిత్రాత్మక సందర్భాన్ని అమెరికన్లు అట్లాంటిక్ సముద్ర తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు మిరుమిట్లుగొలిపే బాణాసంచా పేలుళ్లతో, సైనిక విన్యాసాలతో, కచ్చేరీలు, పెరేడ్లతో అత్యుత్సాహంగా జరుపుకున్నారు.1976లో ద్విశతాబ్ది ఉత్సవాల తదుపరి ఇది అతిపెద్ద పౌర ఉత్సవంగా అనేకమంది అభివర్ణించారు. దేశదేశాలనుంచి ప్రభుత్వాధినేతలు ట్రంప్‌కు శుభాకాంక్షల సందేశాలు పంపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అసాధారణ భిన్నత్వాన్ని ఉత్సవాలు ప్రతిబింబించాయి. న్యూయార్క్ తూర్పునది గగనతలం సంగీతానికి అనుగుణంగా ఫైర్‌వర్క్‌తో కాంతులీనింది. ఫిలడెల్ఫియా అమెరికా స్వాతంత్య్ర జన్మస్థలాన్ని పునఃసందర్శించింది. స్వాతంత్య్ర ప్రకటనను ప్రజలు చదివారు. అయితే ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు వర్షాలు ఉత్సవాల ఉత్సాహాన్ని నీరుగార్చాయి. మౌంట్ రష్మోర్లో ఉత్సవాలు జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్వెల్ట్, అబ్రహాం లింకన్ గ్రానైట్ ముఖచిత్రాల దిగువన ప్రారంభమైనాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తూ అమెరికా ఇప్పుడు మరో చారిత్రక క్రాస్‌రోడ్స్‌లో ఉందన్నారు. అమెరికా ప్రత్యేకతలను ప్రశంసించారు. “మనదేశ పూర్వీకులకు మన వందనాలు” అంటూ, 250 ఏళ్ల క్రితం స్వాతంత్య్ర ప్రకటనలో పొందుపరిచిన సూత్రాలను కాపాడుకోవాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేస్తూ, దేశ వ్యవస్థాపక సూత్రాలకు కమ్యూనిజం కొత్త ప్రమాదం తెస్తోందని తన పచ్చి మితవాద బుద్ధిని బయటపెట్టుకున్నారు.
15వ శతాబ్దంలో జరిగిన తప్పు, 20వ శతాబ్దంలో దిద్దుబాటు అనే జోక్ గుర్తుచేసుకోదగింది ః క్రిష్టఫర్ కొలంబస్ 1492లో ఇండియాకు(భారత్‌కు) సముద్రమార్గం అన్వేషిస్తూ ఒక ఖండానికి చేరాడు. అదే ఇండీస్ అని వాదించాడు. అక్కడున్న అమెరికా ఆదిమవాసులకు ‘ఇండియన్స్’ అని పేరుపెట్టాడు. అలా ఐదు శతాబ్దాలు గడిచిపోయాయి. 1965లో ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం (దేశ మూలాన్ని బట్టి అమెరికాలోకి ప్రవేశించే వారికి కోటా పద్ధతి రద్దు) వచ్చిన తర్వాతగాని విదేశాలనుంచి వలసలు పెరగలేదు. అప్పటినుంచి 1960 నుంచి 1990 వరకు భారత వలస జనాభా ప్రతి దశాబ్దంలో రెట్టింపు అయింది. ఇవాళ 54లక్షలమందికి పైగా ఉన్నారు. ట్రంప్ వలస ప్రజలకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక, పారిశ్రామిక, సైనికాభివృద్ధిలో అమెరికా నిజంగా అగ్రరాజ్యం. ప్రపంచస్థాయి ఆర్థిక, ద్రవ్య సంస్థల పెత్తనాన్ని ప్రపంచ దేశాల పై విధించిన అమెరికా, అంతర్జాతీయ చలామణీ కరెన్సీగా డాలర్‌ను స్థిరపరిచి నయా వలసవాదం ప్రవేశపెట్టింది. 1917లో రష్యాలో బోల్షివిక్ విప్లవం విజయవంతమైన నాటినుంచి కమ్యూనిజాన్ని మట్టుపెట్టటానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫాసిస్టునేత అడోల్ఫ్ హిట్లర్‌ను అక్షరాజ్యాలు పీచమణిశాక తూర్పు యూరప్‌కు కమ్యూనిజం విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా వలస దేశాలు స్వాతంత్య్రం పొందాయి. ఆసియాలో తూర్పున చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమైంది. సోవియట్ యూనియన్ రోదసి, అణ్వాయుధాలు సహా అన్ని రంగాల్లో అమెరికాను ఢీ కొంది. వర్థమాన దేశాల ఆర్థికాభివృద్ధికి అండగా నిలిచింది. ఈ పోటీలో ఎట్టకేలకు సామ్రాజ్యవాదం గెలిచింది, 1991లో సోవియట్ యూనియన్ అంతరించింది. కమ్యూనిజం మరణించిందని, తమకు తిరుగులేదని, ప్రపంచంపై పెత్తనం తమదేనని విర్రవీగిన అమెరికా, దాని మిత్ర సామ్రాజ్యవాదులు త్వరలోనే భంగపడక తప్పలేదు. బహుళ ధృవ ప్రపంచం కోసం కమ్యూనిస్టు, వర్థమాన దేశాలు గట్టిగా తలపడుతున్నాయి.
చరిత్రలోని అనేక దశల్లో అమెరికా కూడా ఆటుపోట్లకు గురైంది. కమ్యూనిజాన్ని భూతంగాచూపి ప్రపంచంలోని నియంతలందర్నీ బలపరిచింది. అమెరికా ప్రయోజనాల రక్షణ అనే అసంబద్ధ వాదనతో అన్ని ఖండాలకు తన సైనిక శక్తిని విస్తరించింది. చిన్న ఆసియా దేశం వియత్నాంలో చావుదెబ్బతిని తోకముడిసినాక, మరెక్కడా అది ప్రత్యక్షంగా యుద్ధానికి దిగలేదు. 21వ శతాబ్దం ఆరంభంలో అధ్యక్షుడు బుష్ ఇస్లామిక్ దేశాలపై కత్తిగట్టి స్వల్పవిజయాలు సాధించినా అప్ఘానిస్థాన్లో 20సంవత్సరాలు తిష్టవేసిన అమెరికన్ సైన్యాలు తోకపీకాయి. ఒకటి మాత్రం సత్యం మిలటరీ పారిశ్రామిక కుబేరుల చేతిలో బందీ అయిన అమెరికన్ పాలకులు వారు ఆయుధాలు అమ్ముకోవటానికి వివిధ దేశాల్లో యుద్ధాలు సృష్టిస్తూ ఉంటుంది.
అయితే స్వశక్తితో, వలస ప్రజల శ్రమశక్తితో ఏకైక అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికా తన ఆర్థిక శక్తితో ప్రపంచాన్ని శాసించగలుగుతున్నది. చక్రగతి ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నా ఆ భారాన్ని వర్థమాన ప్రపంచంపైకి మళ్లించి కోలుకోగలుగుతున్నది. ట్రంప్ రెండవసారి అధ్యక్షుడయినాక ‘అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ దిగుమతులపై ఇష్టానుసారం సుంకాలు పెంచి మిత్ర, అమిత్ర దేశాలను గడగడలాడించాడు. ఆ అధికారం ఆయనకు లేదని సుప్రీంకోర్టు బ్రేకువేసింది. ఇలా పలు ఏకపక్ష నిర్ణయాలను న్యాయవ్యవస్థ రద్దు చేసినా ట్రంప్ విర్రవీగుతూనే ఉన్నాడు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన సైనిక దాడి విఫలం కావటం ట్రంప్, అమెరికా ప్రతిష్టకు తిరుగులేని దెబ్బ. ప్రపంచంలో శాంతి, సామరస్యం నెలకొనాలంటే ఆధిపత్యం బదులు స్నేహం, సంఘీభావం అవసరం. కాని అమెరికా పాలకవర్గాల బాటే సపరేటు.