Skip to content
జాతీయం వార్తలు

టోల్ ప్లాజాను ఢీకొట్టి పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఐదుగురు మృతి

Prajapaksham 03 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
టోల్ ప్లాజాను ఢీకొట్టి పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఐదుగురు మృతి

LPG Tanker Explodes

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో ఒక ఎల్పీజీ (LPG) గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి టోల్ ప్లాజాను ఢీకొట్టి, భారీ పేలుడుకు దారితీసిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన భీకర దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కౌశాంబి జిల్లా కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరోహి టోల్ ప్లాజా వద్ద జూన్ 26వ తేదీ ఉదయం సుమారు 6:40 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. కాన్పూర్ నుండి ప్రతాప్‌గఢ్ వైపు వెళ్తున్న రెండు ఎల్పీజీ ట్యాంకర్లలో ఒకటి.. టోల్ ప్లాజాకు సమీపిస్తుండగా అదుపు తప్పింది. వేగంగా వచ్చి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొడుతూ నేరుగా టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవ్వడం ప్రారంభమైంది. అలా లీక్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా అక్కడ భయంకరమైన పేలుడు సంభవించి, భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఆ మంటలు, దట్టమైన నల్లటి పొగ స్పష్టంగా కనిపించడంతో స్థానిక నివాసితులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

ఘటన గురించి సమాచారం అందిన వెంటనే కౌశాంబి జిల్లాలోని అన్ని అగ్నిమాపక శకటాలు (ఫైర్ టెండర్లు), రెస్క్యూ సిబ్బంది ,స్థానిక పోలీసులు భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ రద్దీని ,గందరగోళాన్ని నివారించడానికి, సహాయక చర్యలు వేగవంతం చేయడానికి అధికారులు కొంత సమయం పాటు వాహనాలను టోల్ ఫీజు లేకుండా ఉచితంగా వెళ్లేందుకు అనుమతించారు. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి ఎట్టకేలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ఈ భయానక ప్రమాదం జరిగిన రోజే ట్యాంకర్ డ్రైవర్ ధర్మేంద్ర దూబే (40)తో పాటు టోల్ ప్లాజా ఉద్యోగి అలోక్ సింగ్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనిల్ కుమార్ జూలై 1న మరణించగా.. మరుసటి రోజు రాయ్‌బరేలీకి చెందిన హీరామణి సింగ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ పాల్ మౌర్య అనే ఇద్దరు టోల్ సిబ్బంది కూడా మరణించారు. దీంతో ఈ దుర్ఘటనలో మొత్తం మరణాల సంఖ్య ఐదుకు చేరింది.

ఈ భారీ పేలుడు కారణంగా ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. టోల్ ప్లాజా పరిసరాల్లో పార్క్ చేసి ఉంచిన దాదాపు 16 మోటారు సైకిళ్లు (బైకులు), రెండు కార్లు ఈ మంటల ధాటికి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. టోల్ ప్లాజా క్యాబిన్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం ఏ కారణాల వల్ల జరిగింది? గ్యాస్ లీకేజీకి దారితీసిన సాంకేతిక లోపాలు ఏమిటి? అనే విషయాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక సాంకేతిక విచారణ బృందాన్ని (టెక్నికల్ టీమ్) ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *