ఈ ఉద్యోగాల్లో సగం మాయమవుతాయి.. పాలో ఆల్టో సీఈఓ నికేష్ అరోరా హెచ్చరిక
పాలో ఆల్టో సీఈఓ నికేష్ అరోరా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగాల భవిష్యత్తుపై ప్రపంచ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం ‘పాలో ఆల్టో నెట్వర్క్స్’ సీఈఓ నికేష్ అరోరా సంచలన అంచనాలను వెల్లడించారు. ఏఐ మరింత సామర్థ్యవంతంగా, తెలివిగా మారుతున్నందున రాబోయే మూడేళ్లలో తమ కంపెనీలోని మార్కెటింగ్, ఫైనాన్స్,హెచ్ఆర్ (HR) బృందాల పరిమాణాన్ని సగానికి తగ్గించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. కంపెనీలలోని జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (ప్రక్రియ నిర్వహణ) ఎక్కువగా ఉంటుందని.. అధునాతన ఏఐ అప్లికేషన్ల సహాయంతో ఈ పనులన్నింటినీ మరింత తెలివిగా, స్వయంచాలకంగా మార్చవచ్చని స్పష్టం చేశారు.
ఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం పొందిన ఉద్యోగిగా రికార్డు సృష్టించిన బిలియనీర్ నికేష్ అరోరా (ఐఐటి-BHU వారణాసి పాత విద్యార్థి), ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాస్ (SaaS – సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) అప్లికేషన్ల స్థానాన్ని భవిష్యత్తులో మరింత స్వయంప్రతిపత్తి గల ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్లు భర్తీ చేస్తాయని నమ్ముతున్నారు. సాస్ అప్లికేషన్లకు ఎలాంటి సొంత అభిప్రాయాలు ఉండవని, కానీ రాబోయే ఏఐ వ్యవస్థలు తమకంటూ ఒక సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటాయని ఆయన విశ్లేషించారు.
ఉదాహరణకు, ఒక ఏఐ అసిస్టెంట్ మార్కెటింగ్ కాపీని చూసి.. ఈ కాపీ సరిగ్గా లేదు, మీ బ్రాండ్ శైలికి అనుగుణంగా లేదు, దీనికి బదులు ఈ మార్పులు చేయండని సిఫార్సు చేయగలదని, ఇది సగటు ఉద్యోగిని మరింత తెలివిగా మారుస్తుందని వివరించారు. ఎక్కువ పనిని ఏఐ వ్యవస్థలే పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో కంపెనీలకు అంత ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదని, ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది ఉద్యోగుల సంఖ్య భవిష్యత్తులో సగానికి తగ్గుతుందని ఉదాహరణగా పేర్కొన్నారు.
ఏఐ విస్తరణ వల్ల కొన్ని రకాల ఉద్యోగాలలో కోతలు పడినప్పటికీ, సాంకేతిక ,అమ్మకాల (సేల్స్) వనరులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. కంపెనీ ఉత్పత్తి నిజంగా అద్భుతంగా ఉన్నప్పుడు, దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎక్కువ మంది వ్యక్తులు అవసరమవుతారని, అయితే వారంతా కచ్చితంగా “ఏఐ పరిజ్ఞానం ఉన్న” వ్యక్తులై ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ కార్పొరేట్ రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే.. సంస్థలలోని దాదాపు 90% మంది ఉద్యోగులకు ఏఐపై సరైన అవగాహన లేకపోవడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు స్వయంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సుమారు $287 బిలియన్ల మార్కెట్ విలువ కలిగిన పాలో ఆల్టో నెట్వర్క్స్ సంస్థలో రాబోయే మూడేళ్లలో పూర్తి ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మనం ప్రస్తుతం డార్వినియన్ దశ (అర్హత గలదే మనుగడ సాగిస్తుంది) కు తిరిగి వచ్చామని, ఇక్కడ ఎవరికి వారు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా, గత రెండేళ్లుగా ఏఐ పునర్వ్యవస్థీకరణ కారణంగా మెటా, అమెజాన్, ఒరాకిల్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ విభాగాలలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.