Skip to content
బిజినెస్ వార్తలు

ఈ20పై ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోంది.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..

Prajapaksham 30 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
ఈ20పై ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోంది.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..

E20 Fuel

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిక్స్ చేసే ‘ఈ20’ (E20) కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం (Ongoing experiment) కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఇథనాల్ మిశ్రమ విధానం వల్ల ఎలాంటి క్షేత్రస్థాయి ఫలితాలు, ప్రభావాలు ఉంటాయనే దానిపై వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టత వస్తుందని వెల్లడించింది. ముఖ్యంగా పాత వాహనాల ఇంజిన్లపై ఈ20 ఇంధనం చూపే ప్రభావం గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు, వినియోగదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒక డిస్టిలరీకి ఇథనాల్ కేటాయింపును పెంచాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ (AG) ఆర్‌.వెంకటరమణి వాదనలు వినిపిస్తూ, ఇథనాల్ సరఫరాకు సంబంధించిన జాతీయ స్థాయి ఒప్పందాలు ఇప్పటికే ఖరారయ్యాయని కోర్టుకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టుల ఉత్తర్వుల ప్రకారం ఒక్కో సంస్థ కోసం కేటాయింపుల్లో మార్పులు చేసుకుంటూ పోతే, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న జాతీయ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు యథాతథ స్థితిని (Status quo) విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాలన్న ప్రభుత్వ ప్రధాన విధానపరమైన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. మార్కెట్ డిమాండ్, లభ్యత ,ఇతర స్థానిక పరిస్థితులను బట్టి చమురు కంపెనీలకు సరఫరా చేసే ఇథనాల్ పరిమాణంలో మాత్రమే హెచ్చుతగ్గులు ఉంటాయని ఆయన వివరించారు. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల ముఖ్యంగా పాత వాహనాల ఇంజిన్లు పాడైపోతాయని, వాహనాల మైలేజీ గణనీయంగా తగ్గిపోతుందనే సందేహాలు కొంతకాలంగా వాహనదారులను వేధిస్తున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం, ఇథనాల్ మిశ్రమం వల్ల ఇంజిన్లకు యాంత్రికంగా నష్టం జరుగుతుందనే ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.

ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల దేశానికి చేకూరుతున్న ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను సైతం ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోందని, ఇప్పటివరకు ఈ విధానం ద్వారా రూ. 1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక వ్యయాన్ని ఆదా చేయగలిగామని ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు (Carbon emissions) తగ్గి పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, ఇథనాల్ తయారీ ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని వివరించింది.

దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌ సరఫరా ఇప్పటికే విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని గడువు కంటే ఐదేళ్ల ముందే, అంటే 2025లోనే దేశం విజయవంతంగా సాధించింది. ఈ విజయవంతమైన ఫలితాల నేపథ్యంలో, రాబోయే 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలనే సరికొత్త భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *