Skip to content
జాతీయం వార్తలు

ఎస్‌ఐఆర్ వివాదంపై ఒక్కటైన విపక్షాలు..ఈసీ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతూ సీజేఐకి లేఖ..

Prajapaksham 30 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఎస్‌ఐఆర్ వివాదంపై ఒక్కటైన విపక్షాలు..ఈసీ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతూ సీజేఐకి లేఖ..

Jai Ram Ramesh

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియ గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో భారత ఎన్నికల సంఘం (ECI) నిష్పక్షపాత పాత్ర, ఎన్నికల నిర్వహణలో తలెత్తుతున్న పలు తీవ్రమైన సమస్యలపై దేశంలోని 23 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ అంశాలను తక్షణమే పరిశీలించాలని కోరుతూ విపక్షాలు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌కు సంయుక్తంగా ఒక లేఖ రాశాయి. 23 రాజకీయ పార్టీల అగ్రనేతలతో పాటు ఒక స్వతంత్ర (ఇండిపెండెంట్) పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) కూడా ఈ లేఖపై సంతకం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అధికారికంగా వెల్లడించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) వంటి కీలక ప్రాంతీయ పార్టీలు కూడా ఈ లేఖకు పూర్తి మద్దతు ప్రకటించి సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని జైరాం రమేశ్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంటూ.. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విపక్షాలన్నీ ఒకే తాటిపై బలమైన సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటనా భావంతో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈనెల జూన్ 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి అగ్రనేతల కీలక సమావేశంలోనే, దేశంలో ఎన్నికల వ్యవస్థ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు రమేశ్ వివరించారు.

ఈ చారిత్రాత్మక లేఖపై సంతకం చేసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్, ,తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ వంటి దేశీయ రాజకీయ హేమాహేమీలు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కారణంగా రాజ్యాంగబద్ధమైన అన్ని స్వతంత్ర వ్యవస్థలు పూర్తిగా విఫలమైనప్పుడు, భారత ప్రజాస్వామ్యం చిట్టచివరి ఆశగా సర్వోన్నత న్యాయవ్యవస్థ వైపే చూస్తుందని విపక్ష నేతలు ఈ సందర్భంగా తమ గట్టి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

న్యాయశాఖ తన అంతరాత్మను (Judiciary’s Conscience) అవలోకనం చేసుకోవాలని, ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలకు జరుగుతున్న నష్టాన్ని జుడీషియరీ తీవ్రంగా పరిగణించాలని లేఖలో విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా అమలు చేస్తున్న ‘సర్‌’ (SIR) విధానం వల్ల వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లు ఎలా వివక్షకు, ప్రభావానికి గురవుతున్నారో ఉదాహరణలతో సహా లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపడుతున్న ఈ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ విధానం వెనుక ఉన్న అంతరార్థాన్ని తాము తీవ్రంగా ప్రశ్నిస్తున్నామని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల పారదర్శకతను కాపాడాలని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *