ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో అమర్‌నాథ్ యాత్ర..ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్రం..
Amarnath Yatra
పవిత్ర యాత్ర అమర్‌నాథ్ ను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు అవతలి ఉగ్రవాద శక్తులు పెద్ద ఎత్తున దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ (నిఘా) వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నిఘా నివేదికలతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం కానున్న ఈ వార్షిక యాత్రకు సంబంధించి జమ్ముకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టం చేసింది. అధికారులు ,భద్రతా బలగాలు రంగంలోకి దిగి యాత్రా మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.
భారత నిఘా సంస్థల విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాల్లో తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైఫల్యాల నుంచి తమ దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) భారత్‌లో భారీ అలజడి సృష్టించాలని కుట్ర పన్నుతోంది. ఇందులో భాగంగానే జమ్ముకశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో దాక్కున్న కొంతమంది స్థానిక ఉగ్రవాదులతో పాక్ మూకలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యాత్రికులపై పెద్దఎత్తున ఆత్మాహుతి లేదా మెరుపు దాడులు జరిపేలా వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భద్రతా వర్గాలు నిర్ధారించాయి.
ఈ ముప్పును తిప్పికొట్టేందుకు కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు యాత్రా మార్గంలో భారీగా అదనపు పోలీసు, కేంద్ర భద్రతా బలగాలను (CRPF, ఆర్మీ) మోహరించారు. సాంప్రదాయ భద్రతతో పాటు ఈసారి ఉగ్రవాద వ్యతిరేక నిఘా వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడించారు. యాత్ర జరిగే సున్నితమైన ప్రాంతాలలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత నిఘా కెమెరాలు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థలను ,డ్రోన్లను రంగంలోకి దించారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా క్షణాల వ్యవధిలో స్పందించేలా కంట్రోల్ రూమ్‌లను అనుసంధానించారు. భక్తుల రక్షణకు ఎలాంటి లోటు రానీయబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ నిఘా హెచ్చరికల నేపథ్యంలోనే జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సరిహద్దు పరిసరాల్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు (Search Operations) చేపట్టాయి. అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్న ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక కమాండో బలగాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో సైన్యం అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నందున, అమర్‌నాథ్ భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే, యాత్రికులు కూడా ప్రయాణ సమయంలో అధికారిక భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని ,సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి వదంతులను, ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని భద్రతా వర్గాలు విజ్ఞప్తి చేశాయి.