Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గాదె సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
గాదె సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

Gade Sai Krishna Case

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ (25) కస్టడీ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన పోలీసుల సంఖ్య ఐదుకు చేరింది.

తాజాగా అరెస్టయిన వారిలో కృష్ణలంక పిఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు బాబూరావు (A5), సాంబయ్య (A6) ఉన్నారు. వీరిద్దరినీ సిట్ అధికారులు విజయవాడ రెండవ ఏసీఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ బాబూరావును అవనిగడ్డ జైలుకు, సాంబయ్యను గన్నవరం జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) ఎస్.ఎస్.వి.వి. నాగరాజుకు వీరిద్దరూ పూర్తిగా సహకరించినట్లు సిట్ ఆరోపిస్తోంది.

కొన్ని పాత కేసులు, నాన్-బెయిలబుల్ వారెంట్లు ఉన్న సాయి కృష్ణను మే 6వ తేదీన పోలీసులు ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, లాకప్‌లో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని దర్యాప్తులో తేలింది. పోలీసుల దెబ్బలకు తాళలేక సాయి కృష్ణ లాకప్‌లోనే మరణించగా, ఆ విషయాన్ని దాచిపెట్టి మృతదేహాన్ని ఒక ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేసి ఆధారాలు మాయం చేశారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది.

సాయి కృష్ణ అదృశ్యంపై అతని తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో జూన్ 19న భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది. కాగా, నిందితులు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని కూడా ఉద్దేశపూర్వకంగా తొలగించారని సిట్ ఇప్పటికే కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు, ఇన్‌స్పెక్టర్ నాగరాజును సిట్ అధికారులు జూన్ 23నే అరెస్ట్ చేయగా, కోర్టు అతనికి జులై 8 వరకు రిమాండ్ విధించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఇప్పటికే లొంగిపోగా, ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును అన్ని కోణాల్లో నిశితంగా దర్యాప్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *