Skip to content
తెలంగాణ వార్తలు

ఊహాజనిత బడ్జెట్ కాదు..వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే బడ్జెట్: సీఎం రేవంత్ రెడ్డి

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఊహాజనిత బడ్జెట్ కాదు..వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే బడ్జెట్: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Review Meeting

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణ మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవాలంటే ఆదాయ సమీకరణపై అత్యంత సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ (HMDA), టీజీఐఐసీ (TGIIC) వంటి కీలక సంస్థలు తమ పరిధిలోని ఆదాయ వనరులను పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ వంటి ప్రధాన శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడా ఎలాంటి ఆదాయ లీకేజీలు లేకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆదాయ సమీకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు, వేగవంతం చేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసుకోవాలని, దీని ద్వారా ప్రతిపాదనల అమలును నిరంతరం ఫాలో అప్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు రావాలంటే శాఖల వారీగా సిబ్బంది, వ్యవస్థల సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలని అధికారులను కోరారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను సరిచూసేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించుకోవాలని, తద్వారా లబ్ధిదారుల డేటాను నేరుగా నగదు బదిలీ (DBT) వ్యవస్థకు అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు.

రాబోయే బడ్జెట్ రూపకల్పనపై స్పందిస్తూ, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇతర అత్యవసర పనులను పూర్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అందులో భూసేకరణ ప్రక్రియకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఊహాజనిత బడ్జెట్‌లను కాకుండా, పూర్తిగా వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందిస్తుందని స్పష్టం చేశారు. వివిధ శాఖల పనితీరు మెరుగుపడటానికి, ఆదాయ వనరుల పెంపునకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *