అయోధ్య రాముని ఇంట్లో దొంగలు
Ayodhya Ram Temple Donation Case: All 8 Accused Sent to Custody Till June 29, ₹79.85 Lakh Recovered
అయోధ్య రాముడు హిందువులకు ఆరాధ్యుడు. గుణాభిరాముడిగా, ఆదర్శ పురుషుడుగా రామాయణ గాథ ఆవిష్కరించింది అదే ప్రజల విశ్వాసం. ఆధునిక కాలంలో రామజన్మభూమి పై ఆందోళనతో బిజెపి సహా ఆర్‌ఎస్‌ఎస్ పరివారం వివాదాలు అధిగమించి అయోధ్యలో బాలరాముని ఆలయం నిర్మించి హిందూ మత గురువులతో కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో విగ్రహ ప్రాణప్రతిష్ట ఉత్సవం నిర్వహించింది. చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి ఉచిత తీర్థయాత్రలు ఏర్పాటు చేసింది. రాముడు హిందువుల ఆత్మ అని ప్రబోధించే పెద్ద మనుషులు ఆలయాన్ని ఎంత ఆరాధనభావంతో, ఎంత కట్టుదిట్టంగా నిర్వహించాలి. ఆలయంలో దొంగలు ప్రవేశించారని, భక్తులు పవ్రితమైన మనస్సులతో బాలరామునికి సమర్పిస్తున్న కానుకలు నగదు, వెండి, బంగారం వగైరా దోచుకుపోతున్నారని ఆరోపణరావటం ఎంతటి మహాపచారం! ఏ రాజకీయ నాయకుడో, సామాజిక కార్యకర్తో ఈ ఆరోపణ చేసి ఉంటే ఈ పాటికి చీల్చిచెండాడేవారు. రామజన్మభూమి ఉద్యమంతో సంబంధం కలిగిన హిందూత్వ నాయకుడు సంతోష్ దూబె ఈ ఆరోపణ చేయటం, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సీనియర్ సభ్యులు చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావు, అలాగే ఉద్యోగి రాం శంకర్ యాదవ్‌లను నేరస్థులుగా వ్రేలెత్తి చూపటంతో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి పాదాల కింద భూమి కంపించినంత పనైంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌దాస్ ఈ ఆరోపణను ఖండిస్తూనే, కాలహరణం కాటువేస్తుందని భయపడ్డారో ఏమో వెంటనే కేసు పోలీసులకు నివేదించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. సంతోష్ దూబె ఫిర్యాదుపై అయోధ్య పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. “రామాలయ రక్షణ, భక్తుల విశ్వాసం కాపాడే బాధ్యతను ఈ వ్యక్తులకు అప్పగించబడింది. అయితే వీరు దేవాలయాన్ని లూటీ చేశారు” అని దూబె నిందించాడు. కాగా తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఈ చోరీ వ్యవహారం హిందువుల మత మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఉన్నతస్థాయి హిందూమత గురువులు, సన్యాసులు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలను తీవ్రంగా విమర్శించారు. శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆలయ ట్రస్ట్ నిర్వహణ తీరును తప్పుబట్టారు. పలుకుబడి గల వ్యక్తులను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. పాలకపార్టీ హిందూత్వ ‘నకిలీ’ అంటూ, ఎఫ్‌ఐఆర్‌లో కిందిస్థాయి ఉద్యోగులనే దోషులుగా చేర్చటాన్ని ప్రశ్నించారు.
39 రోజుల్లో 74 చోరీలు జరిగాయన్న సిట్ తాత్కాలిక నివేదికననుసరించి 8మంది ఉద్యోగులను సస్పెండ్ చేయగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. హిందూత్వవాదుల ఒత్తిడి కింద ఆత్మరక్షణ చర్యగా కావచ్చు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, మరో ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేశారన్న వార్తలు శుక్రవారం సాయంత్రం గుప్పుమన్నాయి. విశ్వహిందూ పరిషత్ ఆదేశంపై చంపత్‌రాయ్ రాజీనామా చేశారనటాన్ని విహెచ్‌పి త్రోసిపుచ్చింది. రాజీనామా పత్రాలు అందినట్లు ట్రస్టు శనివారం ధృవీకరించింది. వచ్చేనెల 12న సమావేశంలో ట్రస్టు వాటిని పరిశీలిస్తుంది. చంపత్‌రాయ్ ఈ ఆలయ ఉద్యమం నాటినుంచి నిర్మాణం, నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అతను ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, విహెచ్‌పి సీనియర్ నాయకుడు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయ నిర్మాణం, మేనేజిమెంట్ బాధ్యతలు చేపట్టారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన రెండున్నర ఏళ్లలోనే చంపత్ రాయ్ ఆలయ విరాళాల్లో అవినీతి, భక్తుల కానుకల దొంగతనాల వివాదంలో కేంద్రబిందువు అయినారు. గతంలో అప్పుడప్పుడూ వచ్చిన నిధుల దుర్వినియోగ ఆరోపణలను ఆయన గట్టిగా ఖండించారు. 2021లోనే దేశవ్యాప్తంగా నిధుల సేకరణ కార్యక్రమం రాయ్ గుర్తింపును, స్థాయిని పెంచింది. నిధుల గోల్‌మాల్ ఆరోపణలే కాదు, భూముల కొనుగోలులో అక్రమాల ఆరోపణలు కూడా ఉన్నాయి.
సిట్ తాత్కాలిక నివేదిక నిర్ధారణలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుక చందంగా ఉంది. ఇప్పుడు ఆదిత్యనాథ్ హడావుడి అంతా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలపై ఈ నిధులు, కానుకల చోరీ ప్రభావం పడకుండా చూడటమే. ఈ ఆలయ నిర్మాణాన్ని జీవిత సాఫల్యంగా భావించే ప్రధాని మోదీ ఇంతవరకు నోరుమెదపకపోవటం ఆశ్చర్యకరం. కొందరు ఉద్యోగులను బాధ్యులను చేసి ‘పెద్దలను తప్పించే’ ప్రయత్నం జరుగుతోందని అనుమానించబడుతున్నది. వాస్తవాలు బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌తో సాధ్యం కాదు. అందువల్ల భక్తుల్లో విశ్వాసం పునరుద్ధరించే నిమిత్తం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు లేదా సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వంలో దర్యాప్తు జరిపించాలి. ఇది కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమైనందున సందేహాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి. ట్రస్టును ప్రక్షాళన చేయాలి. దాని నిర్వహణలో ధార్మిక సంస్థలకు స్థానం కల్పించాలి.