పుస్తకాల అట్టలపై స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు తెలిపే నేమ్ స్టిక్కర్లు
Book Covers Highlight Freedom Fighters Through Name Stickers
భారత స్వాతంత్య్ర పోరాటంలో అపూర్వ త్యాగాలు, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆంగ్లేయులతో పోరాడిన భారత స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను భావి తరానికి ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ తెలుగు రాష్ట్రాలలో పాఠశాలల ప్రారంభం వేళ అక్షరాల లక్ష ‘నేమ్ స్టిక్కర్ల’ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించడం హర్షణీయం. ఈ రకంగా ఆయన చేస్తున్న ఈ కృషి మూలంగా ‘భారత స్వాతంత్య్ర సమరయోధుల పోరాట చరిత్రలను విద్యార్థులు సులువుగా అవగాహన చేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. పాఠ్య పుస్తకాల అట్టల మీద అంటించుకునే లక్ష ‘నేమ్ స్టిక్కర్ల’ పంపిణీ కార్యక్రమాన్ని సయ్యద్ నశీర్ అహమ్మద్ మొదటగా 2018 లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నాలుగేళ్ల పాటు ఆయన ఆరు లక్షల నేమ్ స్టిక్కర్లు ముద్రించి దేశంలోని వందలాది పాఠశాలలోని వేలాదిమంది విద్యార్థులకు అందజేసి భారతదేశంలోనే సరికొత్త చరిత్రను సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ రకంగా ఆయన స్వాతంత్య్ర సమరయోధుల స్టిక్కర్లు అందజేయడం చాలా అరుదైన విషయం.
పుస్తకాల మీద వేసుకునే అట్టలు దాదాపు నాలుగు నెలల పాటు సురక్షితంగా ఉంటాయి. సహజంగా పాఠశాలల విద్యార్థులు తమకు ఇష్టమైన చలనచిత్ర నటులు, క్రికెట్ క్రీడాకారులతో కూడిన నేమ్ స్టికర్ల ను పుస్తకాల అట్టలకు ఉపయోగిస్తుంటారు. కాని దీనికి భిన్నంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, క్లుప్తంగా ఆ యోధుల పోరాటాల వివరాలను నేమ్ స్టిక్కర్ల మీద అంటించడం మూలంగా ఇటు విద్యార్థు లు, ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు కూడా ఆ స్టిక్కర్లు మీద ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు తెలుసుకునే విధంగా సయ్యద్ నశీర్ అహమ్మద్ ముందుచూపుతో శ్రమించారు.
ఈ నేమ్ స్టిక్కర్ల మీద విద్యార్థుల పేర్లు, పుస్తకాల వివరాలు,
పాఠశాల వివరాలు రాసుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా స్వాతంత్య్ర సమరయోధుల రంగుల చిత్రాలు, వారి జనన-మరణాల వివరాలు, స్వాతంత్య్ర సంగ్రామంలో వారు చేసిన కృషిని తెలియజేసే విధంగా సయ్యద్ నశీర్ అహమ్మద్ ఏక వాక్య సమాచారంతో ‘సూక్ష్మం లో మోక్షం’లా రూపొందించిన తీరు అత్యద్భుతం. ‘పుస్తకాల వైపు చూసినప్పుడు అసంకల్పితంగా విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు ప్రతిబింబించడం మూలంగా వారి పోరాటాల ఘట్టాలు విద్యార్థుల మస్తిష్కాలలో కలకాలం నిలిచిపోయే విధంగా ఆయన ఈ ‘నేమ్ స్టిక్కర్ల’ను రూపొందించడం గమనార్హం. ఆ రకంగా భావి విద్యార్థులను అత్యద్భుతంగా ఆకట్టుకునే విధంగా ‘నేమ్ స్టిక్కర్ల’ను రూపొందించడంలో ఆయన విశేషంగా కృషి చేశారు.
మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొని అపూర్వ త్యాగాలు, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఆంగ్లేయులతో పోరాడిన భారత స్వాతంత్య్ర సమరయోధులను పోరాట చరిత్రలను నేటి తరానికి సంక్షిప్తంగా తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ కార్యక్రమాన్ని క్రమానుగతంగా కొనసాగిస్తూ ముందుకు సాగిపోతుండడం గొప్ప విషయం. అనేక అవాంతరాలు, అవరోధాలు సంభవించిననూ ఆయన వాటన్నింటిని దాతల ఆర్థిక చేయూతతో, సేవాసంస్థల, సామాజిక కార్యకర్తల క్రియాశీలక సహకారం తో అధిగమిస్తూనే ఈ నేమ్ స్టిక్కర్ల కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయం. ఆయన నిర్వహిస్తున్న సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మరెందరో సేవా దృక్పథాన్ని అలవరచుకుని ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాగే సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రారంభించి న ఈ సరికొత్త ‘నేమ్ స్టిక్కర్ల’ కార్యక్రమాన్ని ముఖ్యంగా జర్నలిస్టులు ప్రజల దృష్టికి తీసుకురాల్సిన అవసరం తప్పకుండా ఉంది. – జె.జె.సి.పి. బాబూరావు