Skip to content
జాతీయం వార్తలు

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనమైన 20 మంది అసమ్మతి ఎంపీలు..

Prajapaksham 15 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనమైన 20 మంది అసమ్మతి ఎంపీలు..

20 Rebel Trinamool Lok Sabha MPs Seek to Merge With Nationalist Citizen Party of India

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓటమి అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరిగింది. అసలైన తృణమూల్ తమదేనంటూ ఇప్పటివరకు వాదిస్తూ వచ్చిన తిరుగుబాటు ఎంపీలు, ఆదివారం నాడు ఊహించని విధంగా ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌సీపీఐ) అనే ప్రాంతీయ పార్టీలో విలీనమైనట్లు ప్రకటించారు.

తిరుగుబాటు ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న కకోలీ ఘోష్ దస్తీదార్ మీడియాతో మాట్లాడుతూ.. టీఎంసీ తరఫున గెలిచిన మొత్తం ఎంపీల్లో మూడింట రెండొంతుల (2/3) కంటే ఎక్కువ మెజారిటీ తమకు ఉందని, అందుకే ముందడుగు వేస్తూ తామంతా ఎన్‌సీపీఐలో విలీనమయ్యామని స్పష్టం చేశారు. తాము లోక్‌సభలో ప్రత్యేక గ్రూపుగా కొనసాగుతామని, తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమితో కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు.

మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడిగా పేరొందిన సుదీప్ బందోపాధ్యాయ సైతం ఈ తిరుగుబాటు వర్గంలో చేరడం విశేషం. ఏది నిజమైన టీఎంసీ అనే విషయాన్ని భవిష్యత్తులో కోర్టులే నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్ఠానం తక్షణమే స్పందించింది. తిరుగుబాటులో ఉన్న సయానీ ఘోష్, మాలా రాయ్, సుదీప్ బందోపాధ్యాయలను పార్టీ కీలక పదవుల నుంచి తప్పించి వారి స్థానంలో ఇతరులను నియమించింది. అదే సమయంలో, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పంపిన లేఖను ఎంపీలు కీర్తి ఆజాద్, సాగరికా ఘోష్ స్పీకర్ ఓం బిర్లాకు అందజేస్తూ, ఈ తిరుగుబాటు ఎంపీలను గుర్తించవద్దని కోరారు.

ఈ విలీన నిర్ణయం వెనుక బీజేపీ వ్యూహాత్మక అడుగులు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రస్తుతం ఉన్న ప్రజా వ్యతిరేకత, అవినీతి ఆరోపణల ప్రభావం తమపై పడకుండా ఉండేందుకే బీజేపీ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీఎంసీ నేతలను నేరుగా తమ పార్టీలో చేర్చుకుంటే బెంగాల్‌లోని స్థానిక బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో, గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో ఉన్న ఎన్‌సీపీఐలో ఈ విలీనం జరిపించినట్లు సమాచారం. ఈ వ్యూహం ద్వారా తిరుగుబాటు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురికాకుండా లోక్‌సభ సభ్యులుగా కొనసాగవచ్చు.

ఈ తిరుగుబాటుదారులు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) గత త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కొన్ని స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లను సాధించింది. కేంద్ర ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం కోల్‌కతాలోని హావ్‌డా చిరునామాతో ఉన్న ఈ పార్టీ, గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో 1,692వ స్థానంలో ఉంది. ఈ ఇరవై మంది ఎంపీలు దాదాపు రెండేళ్లపాటు ఇదే పార్టీలో కొనసాగుతారని, రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వీరికి చోటు దక్కే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. చివరకు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పార్టీని అధికారికంగా బీజేపీలో విలీనం చేసేలా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *