రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం-కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం
Modi Cabinet
కేంద్ర ప్రభుత్వం.. రైతులు, పునరుత్పాదక ఇంధనం, క్రీడారంగానికి ఊతమిచ్చే పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం-సూర్య సరోవర్ యోజనకు ఆమోదం లభించగా.. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. అలాగే దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతులు, ప్రతిభాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రూ.36,441 కోట్ల వ్యయంతో పునర్వ్యవస్థీకరించిన ఖేలో ఇండియా పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశాభివృద్ధి, ఇంధన భద్రత, వ్యవసాయం, క్రీడా రంగాలకు మహర్దశ కల్పించేలా రూ. 4.51 లక్షల కోట్లకు పైగా విలువైన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టులు, పథకాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఈ నిర్ణయాల్లో అత్యంత కీలకమైనది దేశంలోని రైతులకు ఆర్థిక ఊరటనిచ్చే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పొడిగింపు. ఈ పథకాన్ని 2026-27 నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు.. మరో ఐదేళ్లపాటు వర్తింపజేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ. 3.15 లక్షల కోట్లను కేటాయించారు. దీనివల్ల అర్హులైన ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 చొప్పున మూడు వాయిదాలలో రూ. 2,000 లెక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే ప్రక్రియ రాబోయే ఐదేళ్లపాటు ఎలాంటి విఘాతం లేకుండా కొనసాగనుంది.
దేశీయంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచి ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో సముద్ర మంథన్ అనే జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకానికి కేబినెట్ రూ. 84,084 కోట్లను ఆమోదించింది. లోతైన సముద్ర ప్రాంతాల్లో డ్రిల్లింగ్, డేటా సేకరణ, సముద్రతీర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా సుమారు 600 మిలియన్ టన్నులకు పైగా కొత్త ఇంధన నిల్వలను వెలికితీయడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశయాలకు బలమైన ఊతాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
అలాగే, దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు మరియు అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులను సద్ధు చేసేందుకు ఖేలో ఇండియా పథకాన్ని విస్తరిస్తూ రూ. 36,441 కోట్లను కేటాయించారు. ఇది గతంలో కేటాయించిన నిధుల కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. రాబోయే రోజుల్లో 2030 కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్, పారాలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడోత్సవాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా, విద్యా వ్యవస్థతో క్రీడలను అనుసంధానిస్తూ ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి పీఎం సూర్య సరోవర్ యోజన కోసం రూ. 5,070 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది.
- Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 అడుగులుకు చేరిన నీటి మట్టం..రెండో ప్రమాద హెచ్చరికతో హై అలర్ట్..
- వీడియో ఇదిగో.. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.. మిత్రుడిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు..
- ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం..ఇరాన్ తాజా దాడులతో హార్ముజ్జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు..
- రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం-కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం
- భ్రమలు గొలుపుతున్న కోచింగ్ సెంటర్లు