Skip to content
జాతీయం వార్తలు

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఈసీ వద్దకు వెళ్లాలని సూచించిన అత్యున్నత ధర్మాసనం..

Prajapaksham 12 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఈసీ వద్దకు వెళ్లాలని సూచించిన అత్యున్నత ధర్మాసనం..

Supreme Court Directs Meenakshi Natarajan to Seek Relief from Election Commission

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆమె దాఖలు చేసిన అత్యవసర రిట్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329ను ఉటంకిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. తెలంగాణలో నమోదైన ఒక లీగల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని, సమన్ల వివరాలను మీనాక్షీ నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్ (ఫామ్ 26) లో పొందుపరచలేదని మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అసంపూర్ణ పత్రాలను సమర్పించారనే కారణంతో అక్కడి రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.

దీనిపై మీనాక్షీ నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితేనే ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని, ప్రస్తుత కేసులో కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని కోర్టుకు తెలిపారు. రిటర్నింగ్ అధికారి తప్పుడు పద్ధతిలో నామినేషన్ పత్రాలను తిరస్కరించారని, కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనలతో ఏకీభవించలేదు. “రిటర్నింగ్ అధికారి నిర్ణయం ఎంత తప్పైనా కావచ్చు.. కానీ ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, దానికి పరిష్కారం కోసం ఎన్నికల సంఘాన్ని లేదా ‘ఎన్నికల పిటిషన్’ (Election Petition) ద్వారా సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే” అని స్పష్టం చేసింది. గతంలో నామినేషన్ల తిరస్కరణ కేసులలో కోర్టులు నేరుగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేదా తీర్పులు ఏవైనా ఉన్నాయా అని మీనాక్షీ లాయర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో నేరుగా జోక్యం చేసుకోవడానికి ఎటువంటి మెరిట్స్ లేవని స్పష్టం చేస్తూ, చట్టప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *