Skip to content
తెలంగాణ వార్తలు

రూ.5,000 కోట్ల భారీ మోసాన్ని అడ్డుకున్నాం: సీపీ సజ్జనార్

Prajapaksham 11 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
రూ.5,000 కోట్ల భారీ మోసాన్ని అడ్డుకున్నాం: సీపీ సజ్జనార్

Hyderaabd CP Sajjanar Reviews Safety Measures with Educational Institutions

గతంలో దేశవ్యాప్తంగా నిషేధానికి గురైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ ‘క్యూనెట్’ (QNet), ప్రస్తుతం సరికొత్తగా ‘ఇగ్నైట్’ (Ignite) అనే పేరుతో అవతారమెత్తిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అంతర్జాతీయ మోసపూరిత సంస్థ ప్రజల నుండి దాదాపు రూ.5వేల కోట్లు దోచుకోవడానికి పన్నిన ఒక భారీ మోసపు కుట్రను పోలీసులు విజయవంతంగా భగ్నం చేసినట్లు ఆయన ప్రకటించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

ఈ అంతర్జాతీయ మాయాజాల నెట్‌వర్క్ గత 25 ఏళ్లుగా నిరంతరం తన పేర్లను మార్చుకుంటూ ప్రజలను నిలువునా ముంచుతోందని సీపీ వివరించారు. ప్రారంభంలో గోల్డ్ క్వెస్ట్ ఆ తర్వాత క్వెస్ట్ నెట్, అటుపిమ్మట ‘క్యూనెట్’గా మారి, ఇప్పుడు తాజాగా ‘ఇగ్నైట్’ అనే కొత్త పేరుతో అమాయక ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ తరహా చట్టవిరుద్ధమైన మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు సర్వస్వం కోల్పోయి బాధితులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఇలాంటి మోసపూరితమైన ఆశలపట్ల, నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన గట్టిగా సూచించారు.

మరోవైపు, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్‌వాడిలో మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు (బాలికలు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటనపై కూడా సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ కేసును పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారని, బాలికల మరణానికి గల ఖచ్చితమైన కారణాలను త్వరలోనే కనుగొంటామని భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మరణించిన బాలికల అంతర్గత అవయవాల నమూనాలను (FSL Reports కోసం) అత్యంత భద్రంగా దాచాలని తాము అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ మరణాలపై పూర్తి స్పష్టత కోసం వైద్య నిపుణుల మరియు ఫోరెన్సిక్ బృందాల నివేదికలను, అభిప్రాయాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీపీ స్పష్టం చేశారు.