పాలమూరు-రంగారెడ్డి వాగ్దానాల వరద దాటేనా?
Palamuru-Rangareddy Project Faces Crucial Test Amid Rising Expectations
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 4,5 తేదీలలో పర్యటించి కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను, మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ పనులను 2028 డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని, పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను, పర్యవేక్షిస్తున్న అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. పాలమూరు బిడ్డగా ప్రాజెక్టులను, ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.
11 సంవత్సరాలుగా నత్తనడకలో పాలమూరురంగారెడ్డి:
2015లో చేపట్టిన ఈ పథకానికి నాటి ప్రభుత్వం రూ.35,200 కోట్ల అంచనాలతో 12.3 లక్షల ఆయకట్టుకు సాగునీరు, హైదరాబాద్ కు త్రాగునీటితోపాటు మార్గంలోని గ్రామాలకు త్రాగునీటిని అందించేందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 టిఎంసిలు వినియోగించుకోవడానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేన, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను, 36 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బిఆర్ హయాంలో ఆరు మోటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. 2023లో బిఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తి చేశామని గతపాలకులు చెపుతున్నారు.బిఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల కోసమే భూసేకరణచేసి, ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపట్టాల్సిన భూసేకరణను పక్కకు పెట్టేశారు.
ప్రాజెక్టు పరిధిలో అన్ని రిజర్వాయర్ల కింద కాలువల నిర్మాణానికి 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. 35 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టును మొదలు పెట్టగా.. 2020లో అప్పటి ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచింది. ప్రాజెక్టు కోసం అప్పటి వరకు రూ. 27 వేల కోట్లు ఖర్చు చేయగా.. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు మరో రూ. 40 వేల కోట్లు అవసరం అవుతాయని గత ప్రభుత్వమే తెలిపింది. ఈ ప్రాజెక్టును 2015 లో ఆరంభిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు సంవత్సరాల లో పూర్తిచేసి పాలమూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి 50 శాతం కూడా పూర్తి చేయలేదు.
నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాలలో 8.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై రూ.35,700 కోట్లు ఖర్చు చేశారు.ఇంకా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తేనే పూర్తవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
భూ సేకరణ ప్రధాన సమస్య ః ప్రధాన కాలువల నిర్మాణానికి 12 వేల ఎకరాలు అవసరం. ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన నాటినుంచి వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నార్లాపూర్, వట్టెం, ఉద్దండాపూర్, రిజర్వాయ ర్ల కింద భూములు కోల్పోయిన రైతులు కోర్టులో కేసులు వేయడం, న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తరచూ పనులను అడ్డుకుంటున్నారు. కాళేశ్వరం నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం మాదిరిగానే తమకు పరిహారం చెల్లించాలని ఉద్దండాపూరు నిర్వాసితులు ఆందోళన దిగారు. కొందరు కోర్టును ఆశ్రయించడం తో పనులు ఆగిపోయాయి. 2022, 2023లో ఆఫీసర్లు బలవంతం గా భూములను లాక్కొని పనులు చేసే ప్రయత్నం చేసినా.. నిర్వాసితులు ప్రతిఘటించారు. దీనికి తోడు ఈ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాలను తరలించేందుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ప్రకటించగా.. ఇందుకు సేకరించిన భూముల్లో అవకతవకలు జరిగినట్లు భూమి ఒకరిదైతే.. పరిహారం మాత్రం బిఆర్ లీడర్ల ఎకౌంట్లో జమచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
40 నుంచి 50 శాతం పనులే పూర్తి :
ఈ ప్రాజెక్టు కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉద్దండాపూర్, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్లకు, 36 మోటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బిఆర్ హయాంలో 6 మోటార్లను మాత్రమే ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక మరో 15 మోటార్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు నిర్మించే కెనాల్ పనులు 400 మీటర్ల మేర పెండింగులో ఉన్నాయి. పంప్ హౌస్ వద్ద 150 మెగావాట్ల కెపాసిటీ కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఐదు మోటర్ల పనులు పూర్తయ్యాయి. ఏదుల రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తికాగా.. ఇక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్ కు నీటిని తరలించే కాల్వ పనులు పెండింగులో ఉన్నాయి. రిజర్వాయర్ కింద ఇంకా 40 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వట్టెం రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ఐదు పంపు లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కరివేన రిజర్వాయర్ వరకు నిర్మించాల్సిన కెనాల్ పనుల్లో 10 కి మీ మేర పెండింగులో ఉన్నాయి.
రూ.40 వేల కోట్లు అవసరం:
- మొదటి దశలో ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులు పూర్తి చేయాలంటే మరో రూ.12,100 కోట్లు కావాలని అంచనా. ఈ ప్యాకేజీల పనుల్లో ఇంకా భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు ఉన్నాయి.
- ఉద్దండాపూర్ నుంచి కేపి లక్ష్మీదేవిపల్లె వరకు కూడా ప్రధాన కాలువ, రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలంటే రూ.6,500 కోట్లు అవసరం. అలా ప్రధాన పనులు పూర్తి చేయడానికి రూ. 18,600 కోట్లు అవసరమని నీరు పారుదల శాఖ అంచనా వేసింది.
- వెంకటాద్రి రిజర్వాయర్ కింద 1.33 లక్షల ఎకరాలు, కరివేనా క్రింద 1.82 లక్షల ఎకరాలు. ఉద్దండాపూర్ కింద 5.02 లక్షలు కలిపి 8.27 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలంటే డిస్ట్రిబూటర్స్ కు, పిల్ల కాలువలకు రూ. 15,000 కోట్లు అవసరమని అంచనా. అన్ని పనులు పూర్తి చేయాలంటే రూ.27,100 కోట్లు కావాలి.
- ఈ మొత్తం 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా కెపి లక్ష్మీదేవిపల్లి వరకు పనులు పూర్తి చేయాలంటే ప్రధాన పనులకు రూ. 6,500 కోట్లు కాకుండా డిస్టిబ్యూటర్లకు, పిల్ల కాలువలకు రూ. 7000 కోట్లు కావాలి. మొత్తం మీద మరో రూ.40,600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రస్తుత అంచనా.
రెండు.. మూడేళ్లలో ఖర్చు సాధ్యమేనా?
ప్రస్తుత రేవంత రెడ్డి పాలన రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకా ఈ ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాలే గడువు ఉంది.ఈ పథకాన్ని పూర్తి చేయడానికి ఇంకా రూ. 40,600 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అంచనా వేసిన మేరకు నిధులు ఖర్చు చేయడం రెండు -మూడేళ్లలో జరిగే పని కాదు. ఈ కారణంగా నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది.
8.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమేనా?
2026-27 నాటికి ఉద్దండాపూర్ వరకు పనులు పూర్తి చేసి, 2027-28లో 2 లక్షల ఎకరాలకు, 2028-29లో మరో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది నీటిపారుదల శాఖ ప్రణాళిక. అందుకు సుమారు రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా ఉద్దండాపూర్ నిర్వాసితులకు రూ. 630 కోట్లు పరిహారం అందించారు. ఇందులో కూడా మొదటి సంవత్సరంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది. పెండింగ్ బిల్లులు రూ.1800 కోట్ల వరకు ఉన్నాయి. కరివేన వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని తీసుకురావాలన్న కనీసం రూ.3000 కోట్లు అవసరమని అంచనా. మూడు రిజర్వాయర్లలో నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, ప్రత్యామ్నాయ నివాస స్థలాలు ఓ కొలిక్కి వచ్చినా ఉద్దండాపూర్ కింద సామాజిక, ఆర్థిక సర్వే మాత్రమే జరిగింది. ఈ రిజర్వాయర్ కింద 1948 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. కె.పి లక్ష్మీదేవిపల్లి కింద భూసేకరణను ముఖ్యమంత్రి అంగీకరించారు. దీనికయ్యే వ్యయం అదనం. మొత్తం మీద ఈ పథకం పూర్తయ్యే నాటికి నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
యుద్ధ ప్రాతిపదికగా పెండింగులోనున్న పనులు పూర్తి చేయించాలని.. అందుకు కాంట్రాక్టర్లకు పెండింగ్ లోఉన్న బిల్లులు ఇస్తూ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ని చేపట్టి ముఖ్యమంత్రి ప్రకటించినట్లు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలచేస్తూ ఈ రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయించాలని రైతాంగం కోరుతున్నారు.