Skip to content
జాతీయం వార్తలు

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..

Prajapaksham 09 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..

Meenakshi Natarajan Clarifies There Was No Conspiracy Within Congress

రాజ్యసభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు మధ్యప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె వేసిన నామినేషన్‌ను అక్కడి రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించే అఫిడవిట్‌లో తనపై ఉన్న ఒక కేసు వివరాలను వెల్లడించకుండా దాచిపెట్టారనే కారణంతోనే ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఈ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, తెలంగాణలోని హైదరాబాద్‌ కోర్టులో ఆమెపై ఉన్న ఒక క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్, ఎన్నికల అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇది తీవ్రమైన ఉల్లంఘన కిందికి వస్తుందని, అందువల్ల ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ న్యాయవాదులు గట్టిగా వాదించారు.

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి ఇరుపక్షాల వాదనలను విన్నారు. హైదరాబాద్‌లోని ‘ఫోర్త్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్’ కోర్టులో మీనాక్షి నటరాజన్‌పై నమోదైన కేసు వాస్తవమేనని, ఆ సమాచారాన్ని నామినేషన్ పత్రాల్లో పొందుపరచలేదని నిర్ధారించారు. దీంతో ఆమె నామినేషన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ పూర్తిగా తిరస్కరించారు.

ఈ పరిణామం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. కాంగ్రెస్ పార్టీ కావాలనే కీలక సమాచారాన్ని దాచిపెట్టి తప్పు చేసిందని బీజేపీ మంత్రులు విమర్శించగా, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, తమ అభ్యర్థిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా, నామినేషన్ల పరిశీలనలోనే మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వం రద్దు కావడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ క్యాంప్‌కు ఇది పెద్ద షాక్‌గా మారింది.