అసెంబ్లీకి వస్తే ఎవరేమిటో తేల్చుకుందాం.. మియాపూర్ వేదికగా కేసీఆర్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
CM Revanth Reddy Challenges KCR and BJP Leaders at Miyapur Public Meeting
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు గట్టి సవాల్ విసిరారు. సైబరాబాద్ నగర పాలక సంస్థ (CMC) నూతన కార్యాలయ నిర్మాణంతో పాటు రూ.1,674.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలను మియాపూర్ సభా ప్రాంగణం నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఏం చేశావని అడుగుతున్న వారు అసెంబ్లీకి రావాలని, నాలుగు రోజుల పాటు ప్రత్యేక చర్చ పెట్టి మరీ తాము చేసిన అభివృద్ధిని వివరిస్తామని స్పష్టం చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని, అలాగే పన్నెండేళ్లుగా మోదీ ప్రధానమంత్రిగా ఉన్నా రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పీఏసీ (PAC) ఛైర్మన్ అరెకపూడి గాంధీ ద్వారానే ప్రతిపక్షాల విమర్శలకు తగిన సమాధానం ఇప్పిస్తానని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, రాష్ట్రాభివృద్ధికి మాత్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేసీఆర్ చీకటి ఒప్పందాలు, కుతంత్రాలతో తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతుల కోసం తాను దిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి వస్తే, తాను వచ్చిన మూడు రోజులకు కిషన్‌రెడ్డి దిల్లీ వెళ్లి ఆయా నిధులు, అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చే పనులకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదని, సింగూరు జలాలకు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లో సబర్మతి, దిల్లీలో యమునా, యూపీలో గంగా నది ప్రక్షాళనను ప్రశంసించే వారు, హైదరాబాద్‌లో తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది అభివృద్ధిని మాత్రం రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
సైబరాబాద్ పరిధిలో ప్రస్తుతం ఎకరం భూమి ధర రూ. 200 కోట్లు పలుకుతోందని, ఆ స్థాయికి అనుగుణంగానే ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ నగర పాలక సంస్థ నూతన కార్యాలయాన్ని గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థల తరహాలో, పర్యావరణహిత ‘నెట్ జీరో’ (Net Zero) విధానంలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గాజులరామారంలో వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ బస్ టెర్మినల్ పనులు రాబోయే మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు.
నగరంలోని పేద ప్రజల కోసం సమీపంలోని ప్రభుత్వ భూముల్లో ఒక లక్ష ఎల్‌ఐజీ (LIG), ఎంఐజీ (MIG) గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారని సీఎం తెలిపారు. ఇందుకోసమే ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను ఇవ్వడంతో పాటు వెయ్యి మంది మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని గుర్తుచేశారు. ఐటీ కారిడార్‌లోని ప్రముఖ కంపెనీల మధ్య మూడున్నర ఎకరాల్లో ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను’ ఏర్పాటు చేశామని, మహిళా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి అమెజాన్ వెబ్‌సైట్‌తో వసతి కల్పించామని వివరించారు.
సభలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి నిధులు ఇస్తున్నారని, తనకు గౌరవప్రదమైన పీఏసీ ఛైర్మన్ పదవిని కూడా కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు , ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.