Skip to content
భారతదేశం వార్తలు

విజయ్ ప్రభుత్వం మరో మూడు నెలలు కొనసాగితే అది అద్భుతమే.. టీవీకే ప్రభుత్వ భవిష్యత్తుపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

Prajapaksham 08 Jun 2026 1 నిమిషాల పఠనం భారతదేశం
విజయ్ ప్రభుత్వం మరో మూడు నెలలు కొనసాగితే అది అద్భుతమే.. టీవీకే ప్రభుత్వ భవిష్యత్తుపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

Stalin Questions Stability of Vijay Government, Predicts Tough Road Ahead

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తూ కొత్తగా కొలువుదీరిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్) నేతృత్వంలోని ఈ సరికొత్త ప్రభుత్వం కనీసం మూడు నెలల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేదంటూ ఆయన సంచలన జోస్యం చెప్పారు. గత ఆరు దశాబ్దాల (60 ఏళ్ల) తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, అన్నాడీఎంకేయేతర పార్టీ ఒకటి అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కాగా, మే నెలలోనే విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

మాజీ వీసీకే (VCK) ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన భారీ అనుచరవర్గంతో కలిసి డీఎంకే పార్టీలో చేరిన సందర్భంగా చెన్నైలో ఆదివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం నడుస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు కనీసం ఆరు నెలల పాటు తాము ఎలాంటి విమర్శలు చేయబోమని భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితులు అంతకంటే ముందే మాట్లాడేలా చేస్తున్నాయని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇది ఆరు నెలలా, నాలుగు నెలలా అనే ప్రశ్న కాదని, ఈ ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా నిలబడుతుందా అనేదే ఇప్పుడు అసలు సందేహమని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మారిన ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే నాయకులు డీఎంకే వైపు వస్తున్నారని, కొత్తగా చేరిన వారంతా పార్టీ బలోపేతం కోసం చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో పార్టీలో చేరిన కొత్త నాయకులకు స్టాలిన్ ఒక ముఖ్యమైన హితవు పలికారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను గౌరవించడం అవసరమని, తాము గతంలో పనిచేసిన పార్టీలను వ్యక్తిగతంగా విమర్శించవద్దని సూచించారు. “పక్క పార్టీ తోటలోని మల్లెపూలకు కూడా సువాసన ఉంటుంది” అని తమ పార్టీ వ్యవస్థాపకుడు, దిగ్గజ నేత అన్నాదొరై చెప్పిన మాటలను ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేశారు. రాజకీయాల్లో ఎవరినీ తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే, శనివారం నాటి కార్యక్రమంలో కూడా స్టాలిన్ ప్రస్తుత టీవీకే ప్రభుత్వంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. డీఎంకే , దాని మిత్రపక్షాల దయ వల్లే ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం నడుస్తోందని, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి కార్యకర్తలు ఇప్పుడే ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 1976లో డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసిన తర్వాత, తిరిగి 1989 వరకు తాము అధికారంలోకి రాలేకపోయిన చారిత్రక ఒడిదొడుకులను గుర్తుచేస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం మరింత బలంగా పోరాడాలని డీఎంకే శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *