Core Urban Region Bill 2026: GHMC చట్టానికి గుడ్‌బై.. టీ క్యూర్ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
టీ క్యూర్ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
Core Urban Region Bill 2026: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక, సమగ్ర, సాంకేతిక ఆధారిత పాలనను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ‘టీ క్యూర్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ను ప్రవేశపెట్టింది. దాదాపు 15 లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని 1955లో రూపొందించిన నాటి జీహెచ్‌ఎంసీ చట్టం, ప్రస్తుతం 1.3 కోట్ల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరానికి సరిపోవడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అందుకే హైదరాబాద్ నగర పాలన మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నారు. ఈ ‘క్యూర్’ పరిధిలోకి జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను చేర్చి సమగ్ర పాలనను అమలు చేయనున్నారు. దీనివల్ల మెట్రోపాలిటన్ స్థాయిలో అన్ని విభాగాల మధ్య సమన్వయం కొనసాగుతూనే.. కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పాలన సాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కొత్త బిల్లులో పాత చట్టంలోని కార్పొరేషన్ల నిర్మాణం, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్ల అధికారాలు, వార్డు కమిటీలు, ఎన్నికల విధానం, రుణాల సేకరణ, జంతు నియంత్రణ వంటి కీలక నిబంధనలను యథాతథంగా కొనసాగించారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా మున్సిపల్ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్ సభ్యుడికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించనున్నారు.
ముఖ్యంగా ఆస్తి పన్ను విధానంలో ప్రభుత్వం భారీ మార్పులను రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపాదించింది. ఇకపై వార్షిక అద్దె విలువ స్థానంలో ఆస్తి యొక్క మూలధన విలువ (క్యాపిటల్ వాల్యూ) ఆధారంగా పన్ను విధిస్తారు. దీనివల్ల ఆస్తిపన్ను భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆకాయ్, శునకాల పన్ను వంటి వాటిని రద్దు చేయనున్నారు. ప్రతి ఆస్తికి ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ కేటాయించడంతో పాటు సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటుగా సకాలంలో పన్నులు చెల్లించే వారికి, పర్యావరణహిత చర్యలు చేపట్టే ఆస్తి యజమానులకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. వ్యాపార అనుమతులను మరింత సులభతరం చేస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై ఈ బిల్లు ప్రత్యేక దృష్టి సారించింది. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంతో పాటు, మాన్యువల్ స్కావెంజర్స్ చట్టానికి అనుగుణంగా పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తారు. తాగునీరు, మురుగునీటి నియంత్రణ బాధ్యతలను పూర్తిగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు అప్పగించనున్నారు. సమగ్ర పట్టణ పాలన కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ‘హైడ్రా’ (HYDRAA) సంస్థకు ప్రత్యేక అధికారాలు కల్పించనున్నారు. వీటితో పాటు విపత్తు నిర్వహణ సంస్థ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అథారిటీ, క్లైమేట్ యాక్షన్, వారసత్వ కట్టడాల సంరక్షణ, ఆహార భద్రత, జెండర్ ఇన్‌క్లూజన్, కార్మిక సంక్షేమ సంస్థల వంటి కొత్త విభాగాలను తీసుకురానున్నారు.
సాంకేతిక ఆధారిత సేవల కోసం రియల్‌టైమ్ పర్యవేక్షణకు ‘క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్’ను, అన్ని శాఖల సేవలను ఒకే వేదికపై అందించే సమగ్ర డిజిటల్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ప్రజలకు విద్యుత్, నీరు తదితర సేవలకు సంబంధించి ఒకే కన్సాలిడేటెడ్ యుటిలిటీ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజా ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం ‘క్యూర్ అప్పిలేట్ అథారిటీ’ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే హైదరాబాద్ మహానగర పరిపాలన మరింత కేంద్రీకృతంగా, సాంకేతిక ఆధారితంగా మారి, నగర రూపురేఖల్లో సమూల మార్పులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.