Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వచ్చే రెండు రోజులు పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు

Prajapaksham 03 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వచ్చే రెండు రోజులు పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు

Beware of thunderstorms and lightning: Meteorological Department issues 'Yellow Alert' for AP and Telangana!

తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ పరిధిలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ (Orange Alert) జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) హెచ్చరికలు ఇచ్చింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలను అప్రమత్తం చేసింది.

మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రేపటిలోగా కేరళతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.

ఇక మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అలాగే అదే జిల్లాలోని తల్లాడలో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ, దమ్మపేటలో 3 సెం.మీ, మరియు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో పాటు రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో 40.2 డిగ్రీల నుండి 44.7 డిగ్రీల మధ్య భానుడి భగభగలు రికార్డయ్యాయి. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.