CJP Protest Case: మా టైమ్ వేస్ట్ చేయొద్దు.. చలో సంసద్ ఉద్రిక్తతలపై తక్షణ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు..
లఖింపూర్ హింసాకాండ కేసులో.. ఆశిష్ మిశ్రా బెయిల్ షరతుల సడలింపునకు 'సుప్రీం' నో
CJP Protest Case: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన చలో సంసద్ ఆందోళనపై పోలీసుల చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయవద్దు అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చిన సమయంలో.. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల తీరుకు సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. వాటిని పరిశీలించి గురువారం ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన సీజేఐ, తాము ఆ వీడియోలను చూడాలనుకోవడం లేదని.. వాటిని చూసే సమయం కూడా తమకు లేదని స్పష్టం చేస్తూ తక్షణ విచారణ వినతిని తిరస్కరించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో జరిగిన నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ- సీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులు, యువత జులై 20, 21 తేదీల్లో చలో సంసద్ కార్యక్రమాన్ని తలపెట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టగా.. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రక్షణ సిబ్బంది నిరసనకారులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులతో పాటు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం కాగా, నిరసనకారులే అదుపు తప్పి హింసాత్మకంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
కాగా, సుప్రీంకోర్టు కంటే ముందే ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఇలాంటి ప్రతి అంశంలోకి న్యాయస్థానాలను లాగొద్దని వ్యాఖ్యానించింది. అత్యున్నత న్యాయస్థానాలు రెండూ అత్యవసర విచారణకు నిరాకరించడంతో, పిటిషనర్లు ఇప్పుడు సాధారణ రిజిస్ట్రీ ప్రక్రియ ద్వారా తమ పిటిషన్ విచారణకు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.