COVID-19 Alert in Hyd: హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు బాధితులు.. ఏపీలో కరోనా మరణాలతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆందోళన
COVID-19 Alert in Hyd:హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు బాధితులు.. ఏపీలో కరోనా మరణాలతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆందోళన
COVID-19 Alert in Hyderabad: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో నలుగురు మృత్యువాత పడటం, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తీవ్ర అలజడి ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు గత నెల రోజులుగా తీవ్రమైన జలుబు, విపరీతమైన జ్వరం, పొడి దగ్గు, ఒళ్లునొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులతో వచ్చే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ లక్షణాలతో వస్తున్న రోగులకు నిర్ధారణ పరీక్షలు (RT-PCR) చేయకపోవడంతో అసలు కొవిడ్ బాధితుల సంఖ్య అధికారికంగా బయటకు రావడం లేదు. దాంతో తెలంగాణలో నమోదు కావలసిన కేసులు సున్నాగా చూపిస్తున్నారని ప్రజారోగ్య నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తార్నాకకు చెందిన ఒక మహిళ తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మరణించడం… గాంధీ ఆసుపత్రిలో ఒక కొవిడ్ కేసు నమోదవటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం.. జూన్ చివరి వారం నుండి జూలై మధ్యకాలంలో రాష్ట్రంలో 12 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కడప, కాకినాడ ప్రాంతాలకు చెందిన నలుగురు బాధితులు చికిత్స పొందుతూ మృతి చెందగా.. వీరంతా బిపి, షుగర్, కిడ్నీ వంటి ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. జాతీయ స్థాయిలోనూ జూలై మొదటి రెండు వారాల్లోనే 339కి పైగా కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్ (ICMR) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేసుల నమోదు ఎక్కువగా ఉందని, వైరస్ ఉత్పరివర్తనాల వల్ల శ్వాసకోశ వ్యాధులు మళ్లీ విస్తరించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంతలా కలకలం రేగుతున్నప్పటికీ.. ప్రజారోగ్య విభాగం నుంచి ఏ విధమైన అధికారిక హెచ్చరికలు లేదా నిర్బంధ పరీక్షల ఆదేశాలు రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఆసుపత్రుల్లో గత నాలుగేళ్లుగా కొవిడ్ టెస్టింగ్ కిట్లు, ఎన్-95 మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు నిలిచిపోవడంతో వైద్య సిబ్బందికి రక్షణ కరువై తీవ్ర కొరత ఏర్పడింది. వ్యాధుల తీరుతెన్నులను పర్యవేక్షించాల్సిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) విభాగం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇవి రుతుపవనాల కాలంలో సహజంగా వచ్చే వైరల్ మార్పుల పరిణామమేనని స్పష్టం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో 10 పడకల ఐసోలేషన్ వార్డులను, ప్రాణరక్షణ మందులను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఐఎంఏ (IMA) టాస్క్‌ఫోర్స్ నిపుణులు కూడా ఇది వైరల్ సర్క్యులేషన్‌లో భాగంగా జరిగే మార్పేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే వృద్ధులు, బీపీ, షుగర్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో శ్రేయస్కరమని సూచిస్తున్నారు.