NEET Paper Leak Protest: నీట్ పేపర్ లీక్ వివాదం.. పాట్నాలో విద్యార్థులు భారీ నిరసనలు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు..
ఢిల్లీలో మరో నిరసన.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు మాజీ పోలీసులు పిలుపు
NEET Paper Leak Protest: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ అంశం బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌కు చెందిన విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ ముట్టడి లక్ష్యంగా బయల్దేరిన విద్యార్థుల ర్యాలీని గవర్నర్ నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. జేపీ గోలంబర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను నిలిపివేసి.. ర్యాలీని విరమించుకోవాలని సూచించారు. అయినప్పటికీ విద్యార్థులు పోలీసుల మాటలను తోసిరాజని ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసుల చర్యను తప్పుబడుతూ మరికొందరు విద్యార్థులు డాక్ బంగళా చౌరాహా వద్ద నిరసనను కొనసాగించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ క్రమంలో అదనపు బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులపై విరుచుకుపడ్డాయి.
ఈ ఘర్షణల సమయంలో కొందరు ఆందోళనకారులు పోలీసులు, మీడియా ప్రతినిధులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులతో పాటు పలువురు రిపోర్టర్లు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇదే నీట్ వివాదంపై దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.