Skip to content
తెలంగాణ వార్తలు

Hyderabad Weather: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ఏరియాల్లో ఈదురుగాలులతో దంచికొట్టిన వాన.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Weather: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ఏరియాల్లో ఈదురుగాలులతో దంచికొట్టిన వాన.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..

Hyderabad weather

Hyderabad Weather: ఉదయం నుండి వాతావరణం కాస్త మేఘావృతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని సాయంత్రం ఒక్కసారిగా ముసురు కమ్మేసంది. నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఐటీ కారిడార్ పరిధిలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి వరకు వర్షం భారీగా కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరుకోవడంతో ఐటీ ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మికంగా కురిసిన ఈ వానతో మెట్రో స్టేషన్ల కింద, బ్రిడ్జిల వద్ద వాహనదారులు శరణు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వరద నీరు రోడ్లపైకి నిలవడంతో మాదాపూర్ నుండి గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ నెమ్మదించి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రధాన కూడళ్ల వద్ద వరద ఉధృతికి మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లడంతో జీహెచ్‌ఎంసీ (GHMC) మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగాయి. డ్రెయినేజీ ఆటంకాలను తొలగిస్తూ.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ (IMD) మరో కొన్ని గంటల పాటు నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని నగరవాసులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా వర్షాల్లేక ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్తను అందించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి త్వరలోనే బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో జులై 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే వాతావరణం మారిపోయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి వేళ వానలు దంచి కొట్టగా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా పరిధిలోని జనకాపూర్, కోటపల్లి, తాండూరు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడం గమనార్హం. వీటితో పాటు పెద్దపల్లి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ వర్షాలు ముంచెత్తాయి. సుదీర్ఘ విరామం తర్వాత వర్షాలు ఊపందుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం చల్లబడింది. వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల్లో మరింత తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.