Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భూ కుంభకోణాలపై సర్కార్ సీరియస్..డిప్యూటీ కలెక్టర్‌ రాము నాయక్‌ సస్పెండ్‌..

Prajapaksham 08 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో భూ కుంభకోణాలపై సర్కార్ సీరియస్..డిప్యూటీ కలెక్టర్‌ రాము నాయక్‌ సస్పెండ్‌..

Telangana Govt Revises Property Registration Rates from June 5; Homebuyers Face Higher Costs

తెలంగాణ హౌసింగ్‌ బోర్డులో గతంలో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2013 నుంచి 2018 వ‌ర‌కు డిప్యూటేష‌న్‌పై పనిచేసిన కాలంలో ఆయన అనేక‌ భూ దందాల‌కు, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో చట్టాన్ని కాపాడాల్సిన కొందరు అధికారులు కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టార‌ని ఆయన ఆరోపించారు. హైద‌రాబాద్ కోర్ అర్బన్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ బోర్డు , ప్రభుత్వ స్థలాలను అధికారులు పరిశీలిస్తున్న క్రమంలోనే రాము నాయక్ భూలీలలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని మంత్రి వివరించారు.

బ‌హిరంగ మార్కెట్లో గ‌జం సుమారు రూ. 2 లక్షల వరకు ధర పలికే అత్యంత విలువైన హైకోర్టు గేట్ల వద్ద గల హౌసింగ్ బోర్డు స్థలాన్ని రాము నాయక్ అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేయించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. 2018 ఫిబ్రవ‌రి 17న హౌసింగ్ బోర్డులో వ‌ర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ప‌నిచేసి సస్పెండ్ అయిన ఇఫ్తాక‌ర్ అహ్మద్ భార్య పేరిట ఈ 33.53 చ‌ద‌ర‌పు గ‌జాల‌ స్థలాన్ని అక్రమంగా రాసిచ్చారని, ఆ తర్వాత 2025లో ఆ భూమి మరొకరి పేరిట మారినట్లు విచారణలో తేలిందని పొంగులేటి తెలిపారు. భూమికి సంబంధించిన కనీస ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌కుండా గుడ్డిగా రిజిస్ట్రేష‌న్ చేసిన అప్పటి చార్మినార్ స‌బ్ రిజిస్ట్రార్‌పై కూడా విచార‌ణ‌కు ఆదేశించినట్లు చెప్పారు.

రాము నాయిక్ భూదందాల‌పై 2017 నుంచే ప‌లు కేసులు ఉన్నప్పటికీ.. గత బీఆర్‌ఎస్ పాల‌కులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని మంత్రి విమర్శించారు. కేవలం హైకోర్టు పరిసరాలే కాకుండా విజయ్‌నగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 గజాలు, లక్ష్మిగూడలో 130 గజాలు, మహబూబ్ గంజ్‌లో 497 గజాల ప్రభుత్వ స్థలాలను కూడా రాము నాయక్ ప‌లువురి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని, వాటన్నింటిపై ప్రస్తుతం లోతైన విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని మంత్రి వెల్లడించారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన స‌బ్ రిజిస్ట్రార్‌ల పాత్రపై పూర్తిస్థాయి విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ల ఐజీని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

రాము నాయక్‌పై విచార‌ణ పూర్తి చేసి, అన్ని ఆధారాల‌ను చట్టబద్ధంగా నిర్ధారించిన త‌ర్వాత‌ ఆయన్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ భూఅక్రమాలకు లోపాయికారీగా స‌హ‌క‌రించిన హౌసింగ్ బోర్డు సూప‌రింటెండెంట్ వివేకానంద్‌ను ఇప్పటికే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించామని, మ‌రో సూప‌రింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ఆక్రమణలకు వెనుక ఉండి సహకరించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఏ హోదాలో ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే మరింత కఠినంగా వ్యహరిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *