Skip to content
తెలంగాణ వార్తలు

మిస్టర్ పవన్.. ఇది మా అయ్య జాగీరే..నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరే: మంత్రి పొన్నం ప్రభాకర్

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మిస్టర్ పవన్.. ఇది మా అయ్య జాగీరే..నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరే: మంత్రి పొన్నం ప్రభాకర్

Telangana Minister Ponnam Prabhakar Hits Back at Pawan Kalyan Over Telangana Remarks

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో అహంకారం, ఆధిపత్య ధోరణి కనిపిస్తున్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.”అవును మిస్టర్ పవన్ కల్యాణ్… ఇది మా అయ్య జాగీరే! నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరే.. కానీ నీ అయ్య జాగీరు మాత్రం కాదు” అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ వైఖరిని, ఆయన రాజకీయ చరిత్రను ఎండగడుతూ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ ఇప్పటికీ అక్కసు కక్కుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం అమరవీరులు ప్రాణాలు అర్పిస్తుంటే ఎన్నడూ సంఘీభావం తెలపని పవన్, రాష్ట్రావిర్భావం రోజున గెలకడానికే ‘నవనిర్మాణ సభ’ పెట్టాలనుకున్నారా అని ప్రశ్నించారు. “తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పి, ఈ గడ్డ ఏర్పాటును అవహేళన చేసిన వ్యక్తివి నువ్వు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేటప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. నీకు పార్లమెంటు విధానాలపై కనీస అవగాహన లేకుండా, తలుపులు మూసి బిల్లు తెచ్చారంటూ వక్రభాష్యం చెబుతున్నావు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు పవన్ కల్యాణ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి”* అని మంత్రి డిమాండ్ చేశారు. అలాగే, ప్రజాకవి గద్దర్ గురించి మాట్లాడుతూ ‘నేనే కారు కొనిచ్చా’ అని అహంకారంతో మాట్లాడటాన్ని దళిత వర్గాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయని, గద్దర్ ఆత్మకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ రాజకీయ ఉనికిని ప్రశ్నిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనే జనసేనకు ఒక్క సీటు రాలేదని, డిపాజిట్లు గల్లంతయ్యాయని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకుని బతికి బట్టకట్టారని ఎద్దేవా చేశారు. ఆంధ్రాలోనే తనకు దిక్కులేదని, అక్కడ తానే ముఖ్యమంత్రి కాలేనని ఒప్పుకున్న పవన్.. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ప్రశ్నించారు.”ఆంధ్రాలోనే నువ్వు ఏమీ పీకలేకపోయావు.. ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు? సినిమా నటుడిగా నీకు 2009, 2014ల్లో వచ్చినట్టుగా జనం కేకలు, ఈలలు వేయడానికి వస్తుండొచ్చు. ఆ ప్రేక్షకుల సందోహాన్ని చూసి అదే నీ రాజకీయ బలం అనుకుంటే పొరపాటే”* అని హితవు పలికారు.

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌లా వ్యవహరిస్తున్నారని పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.”ఆయనకు వచ్చే పొలిటికల్ చిట్టీలు బీజేపీ నుంచి వస్తున్నాయో, బీఆర్‌ఎస్ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు ఆయన్ను ఆర్టిస్ట్‌గా ఎంగేజ్ చేసుకుని ఉంటారు. నా దగ్గర కూడా డబ్బులు ఉంటే.. నేనే ఆయనకు ఒక పాత్ర ఇచ్చి, డబ్బులిచ్చి మాట్లాడించేవాడిని. బీజేపీ వాళ్లు ఆయనకు స్క్రిప్ట్ సరిగ్గా రాసివ్వడం లేదు”* అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ ఇక్కడ రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ విగ్రహాల ప్రస్తావన తేవడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు.

భారతదేశంలో, ఫెడరల్ వ్యవస్థలో తెలంగాణ ఒక అంతర్భాగమని.. హైదరాబాద్‌ను అందరూ కలిసి ఉండే కాస్మోపాలిటన్ నగరంగా తాము చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రవాళ్లు తెలంగాణకు రావడానికి, ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఇక్కడ ఆంధ్రావాళ్లకు పనిలేదని తాము ఎన్నడూ అనలేదని పేర్కొన్నారు. “హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? ఇక్కడికి రావడానికి వీసాలు, పాస్‌పోర్టులు తీసుకోవాలా అన్నట్లు పవన్ మాట్లాడుతున్నారు. ముందు నీ మైండ్ సెట్ మార్చుకో. నువ్వు కొండగట్టు వస్తే ఒక గెస్ట్‌గా భావించి తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి గౌరవించింది. అంతేకానీ, ఆవిర్భావ దినోత్సవం నాడు ఇక్కడ గొడవలు పెట్టాలని చూస్తే ఎవరూ ఊరుకోరు. అంతగా రాజకీయాలు చేయాలనుకుంటే పవన్ కల్యాణ్ వెళ్లి గుజరాత్‌లో పార్టీ పెట్టుకోవాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *