Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు వర్ష సూచన.. ఎండలు తగ్గే అవకాశం..

Prajapaksham 09 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు వర్ష సూచన.. ఎండలు తగ్గే అవకాశం..

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం నాడు ఇవి రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాలను తాకాయని, రాబోయే రెండు రోజుల్లో ఇవి తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కూడా కొనసాగుతోంది.

ఈ రుతుపవనాల ప్రభావంతో మంగళవారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వానలు కురవవచ్చు. ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఐదు సెంటీమీటర్ల లోపు వర్షపాతాన్ని సూచించే పసుపు రంగు (Yellow Alert) హెచ్చరికలను జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఇప్పటికే పలు జిల్లాల్లో గణనీయమైన వర్షాలు కురిశాయి. ఇందులో అత్యధికంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడులో 11.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరులో 8.7 సెం.మీ., మహేశ్వరంలో 7.3 సెం.మీ., నల్గొండ జిల్లా దామరచర్లలో 7.2 సెం.మీ. చొప్పున వర్షం పడింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌గా ఎస్‌.స్టెల్లా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. అమరావతి నుంచి బదిలీపై ఆమె ఇక్కడికి రాగా, ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన కె.నాగరత్న అమరావతికి బదిలీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *