పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే: MLA కూనంనేని సాంబశివరావు
MLA Kunamneni Sambasiva Rao Slams Pawan Kalyan, Says Remarks Aim to Divide Telugu States
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎలఎ కూనంనేని సాంబశివరావుతీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ పరిపక్వత లేని వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని, తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక దాగి ఉన్న అజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ-ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఎవరో వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను పెద్దదిగా చేసి, రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజకీయాలు చేయడం ఎవరికై హక్కు ఉంటుందని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం మాత్రం సమర్థనీయం కాదని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
పవన్ కళ్యాణ్ కమ్యూనిజం చచ్చిపోయిందంటూ వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ప్రవేశం సందర్భంగా పవన్ చేగువేరా బొమ్మతో రావడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు భావజాలం సజీవంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలకు స్పందించి ప్రశ్నించే ప్రతి మనిషిలో కమ్యూనిస్టు ఆలోచన ఉంటుందని, దానిని ఎవరూ అంతం చేయలేరని వ్యాఖ్యానించారు.
గతంలో కమ్యూనిస్టు భావజాలం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎర్ర కండువా వేసుకున్న వ్యక్తి ఇప్పుడు కమ్యూనిస్టులనే లక్ష్యంగా చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్‌కు ఆయనకు తాము ఎప్పటికప్పుడు అండగా నిలిచామని చెప్పారు. గద్దర్‌కు తానే కారు ఇచ్చానంటూ పవన్‌కళ్యాణ్ ప్రచారం చేసుకోవడం సరికాదని, ప్రజల ప్రేమాభిమానాలే గద్దర్‌ను నిలబెట్టాయని వ్యాఖ్యానించారు. ఒక చేత్తో చేసిన సహాయాన్ని మరో చేతికి తెలియకుండా చేయాలనే సంస్కారం ఉండాలని సూచించారు. దివంగత గద్దర్ గారి కుమార్తె వెన్నెల ఈ విషయాన్ని ఖండించడం కూడా జరిగిందన్నారు.
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై ఎపిలో నమోదు చేసిన అక్రమ కేసులను నిరసిస్తూ గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సిపిఐ ఆధ్వర్యంలో మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులతో రౌండ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఈ సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తిగా ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా అధిక ధరలను నిరననగా ఈ నెల10న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు 45 నియోజకవర్గాల్లో భారీ పాదయాత్రలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 28న వేలాది మందితో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.