India Summons Russian Diplomat: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి.. రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
India Summons Russian Diplomat: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి.. రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
India Summons Russian Diplomat: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు వద్ద జరిగిన రష్యా క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు దుర్మరణం చెందడం కలకలం రేపింది. ఆదివారం (జూలై 19) సాయంత్రం 17 మంది సిబ్బందితో (వీరిలో ఐదుగురు భారతీయులు) ధాన్యం లోడుతో బయలుదేరిన ఎమ్‌వీ గోల్డెన్ లియో (MV Golden Leo) అనే వాణిజ్య నౌకపై రష్యా బలగాలు ఖేహెచ్-59/69 (Kh-59/Kh-69) రకం క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో నౌకపై భారీగా మంటలు చెలరేగి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. గాయపడిన మరొక భారతీయ నావికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒడెసాలోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ విషాదకర ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌరులను బలితీసుకోవడం మరియు జలమార్గాల్లో స్వేచ్ఛా రవాణాను దెబ్బతీయడం అత్యంత ఖండించదగిన చర్య అని స్పష్టం చేసింది. ఇటువంటి దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ.. బాధితుల కుటుంబాలకు మరియు ఆసుపత్రిలో ఉన్న నావికుడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని వెల్లడించింది.