Rahul Gandhi Arrest Video: ప్రధాని నివాసం ముందు బైఠాయించిన రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్.. నెట్టింట వీడియో హల్చల్…
NEET పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీపై నిరసన తెలుపుతూ ప్రధాన మంత్రి నివాసం ముందు ఆందోళన చేపట్టిన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, సహా ఇతర నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని నిరసన స్థలం నుండి తరలించి, బస్సులో ఎక్కించి మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నిరసన గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో మంతనాలు జరిపేందుకు అక్కడికి వచ్చారు. రాహుల్ గాంధీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, తన డిమాండ్లు అంగీకరించారని తెలిసిన వెంటనే, రాహుల్ గాంధీ మరికొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చారు.
అయితే హై సెక్యూరిటీ జోన్ అయిన ప్రధాని నివాసం ముందు నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతం అంతటా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ (NCP) నాయకురాలు సుప్రియా సూలే కూడా కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్నారు. కాగా, భారీ సంఖ్యలో ప్రజలు ఈ నిరసనలో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత, ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను నిరసన స్థలం నుండి తరలించి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే పలువురు ఇతర కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ఇతర నాయకులను ఢిల్లీ పోలీసు బస్సులో తరలించారు. నాయకులందరినీ నిరసన స్థలం నుండి తరలించారు.
జితేంద్ర సింగ్ రాహుల్‌ను కలవడానికి ఎందుకు వెళ్లారు?
కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం తనను, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌ను పంపిందని జితేంద్ర సింగ్ వివరించారు. NEET దానికి సంబంధించిన నిరసనల అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే, తాను చేపట్టిన నిరసన దీక్షను వెంటనే విరమిస్తానని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ షరతుకు అంగీకరించింది. అయితే, కేవలం దానితోనే తాను సంతృప్తి చెందనని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విషయంలో కూడా హామీ కావాలని ఆయన కోరారు. ఇప్పుడు నా ముందు రెండు డిమాండ్లు ఉన్నాయి: పార్లమెంటులో చర్చ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అని ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే ప్రధాని ఇంటి ముందు జరిగే ఈ ధర్నాలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక పోస్ట్‌లో ఆయన ఇలా రాశారు: “విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లే.” ఎలాంటి సమాధానం చెప్పకుండా లేదా పరిణామాలను ఎదుర్కోకుండా తప్పించుకోవచ్చని ప్రధాని మోదీ భావిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాదు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే ప్రతి దేశభక్తి గల భారతీయుడికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను: ప్రధాన మంత్రి నివాసం బయట జరుగుతున్న మా నిరసన దీక్షలో పాల్గొనండి. అంటూ పిలుపునిచ్చారు.