Skip to content
తెలంగాణ వార్తలు

వాట్సప్‌ కాల్స్ రికార్డ్‌ అవుతున్నాయనేది అవాస్తవం.. వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసిన సీపీ సజ్జనార్‌

Prajapaksham 03 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
వాట్సప్‌ కాల్స్ రికార్డ్‌ అవుతున్నాయనేది అవాస్తవం.. వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసిన సీపీ సజ్జనార్‌

Hyderabad CP Issues Clarification on Viral WhatsApp Recording, Urges Public Not to Panic

వాట్సప్‌ కాల్స్ రికార్డ్‌ అవుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్‌ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవమని, దీన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. ప్రజలను అనవసరంగా భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే కొందరు ఆకతాయిలు ఇటువంటి వదంతులను సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు.

బాధ్యతగల పౌరులుగా ప్రజలు ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని, అలాగే ఇతరులకు ఎవరికీ షేర్ చేయొద్దని ఆయన సూచించారు. సమాజంలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇదే విషయమై గతంలో కూడా తాము పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేశామని, అయినా కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సందేశాన్ని మళ్లీ మళ్లీ షేర్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

ఇంతకీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో ఏముందంటే.. దేశంలోని ఇటీవలి పరిణామాల దృష్ట్యా రేపటి నుంచి వాట్సప్‌తో పాటు సాధారణ ఫోన్ కాల్ నియమాలు అమల్లోకి రానున్నాయని, వాట్సప్‌ మరియు ఇతర సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం పూర్తి నిఘా పెట్టనుందని ఆ పోస్ట్‌ సారాంశం. ఇందులో భాగంగానే వినియోగదారుల అన్ని కాల్స్‌ రికార్డు చేస్తారని, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌తో పాటు అన్ని రకాల సామాజిక మాధ్యమాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆ పోస్టులో రాసి ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇదే తరహా తప్పుడు సందేశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వచ్చాయని, అందువల్ల ఇటువంటి ఆధారాలు లేని సందేశాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *