Skip to content
తెలంగాణ వార్తలు

అమరావతి అద్భుతం అయితే హైదరాబాద్‌లో ఎందుకున్నారు..పవన్, చంద్రబాబుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Prajapaksham 04 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
అమరావతి అద్భుతం అయితే హైదరాబాద్‌లో ఎందుకున్నారు..పవన్, చంద్రబాబుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Gutha Sukender Reddy Slams Pawan Kalyan, Chandrababu Over Amaravati Remark

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు పార్టీలకతీతంగా వరుసగా స్పందిస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా స్పందించారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ లేదా ప్రెస్‌మీట్ నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ సమాజం పండుగ చేసుకునే ఆ శుభదినాన రాజకీయ సభలు, ప్రెస్‌మీట్‌లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అని పవన్‌ను ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించేవారెవరూ ఆ రోజున ఇలాంటి పనులు చేయరని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, పవన్ కల్యాణ్ తన మాట్లాడే భాషను మార్చుకోవాలని హితవు పలికారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా, అదీ పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి మరింత హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణలో అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రేపే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

అక్కడితో ఆగకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి తన విమర్శల బాణాలను నేరుగా ఏపీ కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం గొప్పలు చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిని “బ్రహ్మాండం” అని, “ఈ భూగోళంలోనే అలాంటి అద్భుతమైన రాజధాని మరొకటి లేదు” అని చంద్రబాబు పదేపదే ప్రచారం చేసుకుంటున్నారని, దానికి పవన్ కల్యాణ్ కూడా వంతపాడుతున్నారని చురకలంటించారు.

అమరావతి అంతటి అద్భుత నగరమే అయితే, ముందుగా మీ ఇద్దరూ హైదరాబాద్‌ను వదిలి అక్కడే నివసించాలని స్పష్టం చేశారు. “అమరావతిని అద్భుత రాజధాని అని చెబుతున్నప్పుడు పాలకులంతా అక్కడే ఉండాలి. ఎక్కడో హైదరాబాద్‌లో ఇళ్లు పెట్టుకుని ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో పాటు మంత్రులంతా ఇకనైనా హైదరాబాద్, అమరావతి మధ్య తిరిగే తమ “షటిల్ సర్వీసులను బంద్ చేసుకోవాలి” అని ఘాటుగా సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం మానేసి, ఏపీ అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాలని సుఖేందర్ రెడ్డి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *