Skip to content
తెలంగాణ వార్తలు

మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో ముందడుగు.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణశాఖ అంగీకారం..

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో ముందడుగు.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణశాఖ అంగీకారం..

Gandhi Sarovar Project Gets Big Push with 83 Acres Clearance in Hyderabad

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ఒక అతిపెద్ద ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో తొలి దశలో భాగంగా నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌కు రక్షణశాఖకు చెందిన 83.814 ఎకరాల భూములను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల్లో పనులు ప్రారంభించుకోవడానికి వీలుగా వర్కింగ్‌ పర్మిషన్‌ ఇస్తూ రక్షణశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కీలక పరిణామంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైన్యాధికారులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మూసీ నదిని కేవలం ప్రక్షాళన చేయడమే కాకుండా, నిరంతరం మంచినీటి ప్రవాహంతో దానికి పూర్వవైభవం తెస్తామని సీఎం స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చడంతో పాటు, సంపదను సృష్టించే ఒక పెద్ద ఆర్థిక నడవాగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బాపూఘాట్‌ త్రివేణి సంగమం వద్ద మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఇందులో గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన రక్షణశాఖ భూములు అవసరమవ్వడంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కేంద్రంతో పలు దఫాలుగా సంప్రదింపులు జరపగా, మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ నిరంతరం లేఖల ద్వారా ఫాలోఅప్ చేసింది. ఈ ఏడాది మార్చిలో రక్షణశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన అనంతరం ఈ భూములను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ, రాజేంద్రనగర్‌ మండలం హైదర్‌గూడ, ,గోల్కొండ మండలం ఖిలా మహమ్మద్‌నగర్‌ పరిధిలో నాలుగు భాగాలుగా ఈ 83 ఎకరాల భూమి విస్తరించి ఉంది. ఈ భూములను సమాన విలువ గల మౌలిక సౌకర్యాలు (ఈవీఐ) విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. రక్షణశాఖ దాదాపు రూ. 533.42 కోట్లుగా లెక్కగట్టిన ఈ నిర్దేశిత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రక్షణశాఖ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది లేదా దానికి సమానమైన మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. కేంద్రం నుండి వర్కింగ్‌ పర్మిషన్‌ రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశారు. రక్షణశాఖ అధికారులతో కలిసి త్వరలోనే ఉమ్మడి భూ సర్వే చేపట్టి, రాబోయే 20 రోజుల్లో ఇరు పక్షాలు పరస్పర అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేయనున్నాయి.

మహాత్మా గాంధీ అస్థికలను 1948లో దేశవ్యాప్తంగా కలిపిన 12 ముఖ్యమైన నదీ సంగమాల్లో హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌ వద్ద ఉన్న బాపూఘాట్‌ ఒకటి. మూసా, ఈసా నదులు కలిసే ఈ త్రివేణి సంగమ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ గాంధీ సరోవర్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పలు అంతస్తులతో కూడిన 100 మీటర్ల ఎత్తయిన భారీ టవర్‌ను నిర్మించి, దానిపై 30 మీటర్ల ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ టవర్ లోపలి అంతస్తులలో ఎడ్యుకేషన్‌ అండ్ నాలెడ్జ్‌ హబ్, అంతర్జాతీయ స్థాయి ధ్యాన మందిరం, నేషనల్‌ మ్యూజియం, వినోద కేంద్రాలు, గాంధీ యూనివర్సిటీ ,చేనేత శిక్షణ కేంద్రం వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన 200 ఎకరాలలో ఇప్పటికే పర్యాటక శాఖకు చెందిన 36 ఎకరాలు అందుబాటులో ఉండగా, తాజాగా రక్షణశాఖ 83 ఎకరాలు ఇచ్చింది. మిగిలిన ప్రైవేట్ భూముల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గాంధీ సరోవర్‌కు సంబంధించిన ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ ముసాయిదా త్వరలోనే ఆమోదం పొందనుండగా, జంట జలాశయాల నుంచి 21 కిలోమీటర్ల మేర సాగే మూసీ మొదటి దశ అభివృద్ధి పనులకు నెల రోజుల్లోనే టెండర్లు పిలవడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.