Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలో 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్.. ముందస్తుగా పనులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచన

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్.. ముందస్తుగా పనులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచన

Telangana Suspends Registration Services for Three Days — Check Dates

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, ఇతర ఆస్తుల కొనుగోలుదారులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. సర్వర్ల నిర్వహణ, అప్‌గ్రేడేషన్ (సాంకేతిక ఆధునీకరణ) పనుల కారణంగా జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు దానికి అనుబంధంగా ఉండే అన్ని రకాల ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

గడిచిన ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ స్థాయి పెద్ద ఎత్తున సాంకేతిక నిర్వహణ పనులను చేపడుతున్నట్లు ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ సర్వర్ల భద్రతా ప్రమాణాలు పెరగడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు మరింత వేగవంతమైన, సులభతరమైన సేవలు అందుతాయని ఆయన వివరించారు.

ఈ మూడు రోజుల షట్‌డౌన్ కాలంలో ప్రజలకు పెద్దగా అసౌకర్యం కలగకుండా అధికారులు సెలవు దినాలను ఎంచుకుని ఈ షెడ్యూల్‌ను రూపొందించారు. జూన్ 26వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ హాలిడే ఉండగా, జూన్ 28వ తేదీన ఆదివారం వారంతపు సెలవు ఉంది. ఈ రెండు సెలవుల మధ్యలో ఉన్న జూన్ 27 (శనివారం) ఒకే ఒక్క పనిదినం (Working Day)పై మాత్రమే ఈ సేవల నిలిపివేత ప్రభావం చూపనుంది.

నిర్వహణ పనుల నేపథ్యంలో జూన్ 27వ తేదీన రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారికి అధికారులు కీలక ఊరట కల్పించారు. వారి స్లాట్లను ముందస్తుగా జూన్ 25వ తేదీకి (గురువారం) మారుస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ,ఇతర ఆన్‌లైన్ పోర్టల్స్ అన్నీ పూర్తిగా పనిచేయవు. జూన్ 29వ తేదీ (సోమవారం) ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (SRO) ఆస్తుల రిజిస్ట్రేషన్లు ,ఆన్‌లైన్ సేవలు ఎప్పటిలాగే యథావిధిగా పునఃప్రారంభమవుతాయి. కాబట్టి ఆస్తి కొనుగోలుదారులు, అమ్మకందారులు ఈ సాంకేతిక మార్పును గమనించి తమ రిజిస్ట్రేషన్ పనులను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *